రక్తం ఉరకలు వేసే వయసు.. కళ్లేలు లేని మనసు..! గుండెల నిండా ధైర్యం.. ఏదైనా చేయగలమనే థీమా..! ఇవీ యువతరం బలాలు. సమాజంలోని అవలక్షణాలపై పోరాడగలిగేది.. మార్పు తేగలిగేదీ నవయవ్వనంలోనే. అలాంటి యువతరం ఇప్పుడు నిర్వీర్యంగా.. నిస్తేజంగా మారిపోతోంది. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, స్కైప్.. అంటూ యాప్స్ మంత్రాన్నే జపిస్తోంది. దీనికి ప్రధాన కారణం సెల్‌ఫోన్‌. 2జీలు, 3జీలు పాతబడి 4జీ వచ్చాక యువతపై సెల్ ప్రభావం మరింత పెరిగింది. పల్లె, పట్నం అన్న తేడా లేదు. ఏ చోట చూసినా మొబైల్ వాడకంలో మునిగితేలుతున్న యువతే కనిపిస్తోంది. సెల్ తో కొన్ని లాభాలు ఉన్న మాట వాస్తవమే అయినా.. యువతలో వస్తోన్న పెడధోరణులకు మాత్రం ప్రధాన కారణం సెల్ ఫోనే.

Image result for mobile youth

ఆహారం లేకపోయిన పర్లేదు. కానీ సెల్‌ఫోన్ లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా బతకలేం అంటోంది నేటి యువతరం. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అని అత్యాధునిక సాంకేతికత గల సెల్‌ఫోన్లు వస్తున్నాయి. వాటితో ఇంటర్నెట్, ఫేస్‌బుక్, వాట్సప్ అంటూ రకరకాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటితో నిద్రలేచిన దగ్గరనుంచి అర్థరాత్రి వరకూ గడిపేస్తోంది మన యువజనం.బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్వాలేదు. సెల్‌లో మాత్రం నెట్ బ్యాలెన్స్ ఉండాల్సిందే. ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉండటమే ఇప్పుడు స్టేటస్. పర్సులో పచ్చనోటు లేకున్నా సెల్‌ఫోన్ లో వాట్సప్ ఉంటే ప్రపంచాన్ని జయించినట్లుగా భావిస్తున్నారు. తెల్లవారే దాక చాటింగ్ చేస్తూ తామేదో విజయం సాధించినట్లు తెగ ఫీలైపోతున్నారు. బెడ్డు మీద పడుకున్న భార్యాభర్తలు చెరొకవైపు తిరిగి చాటింగ్ లో మునిగితేలుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్‌ల వల్ల ఒక్కోసారి భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరిగి విడాకులకూ దారితీస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్‌లు అనుసరించి చేస్తున్ను కామెంట్ల ద్వారా వివాదాలు తలెత్తి పోలీస్ స్టేషన్లలో కేసుల దాకా దారితీస్తున్నాయి.

Image result for mobile youth

ఒక నాడు పట్టణాలకే పరిమితమైన స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు పొలం చేలల్లో కూడా చక్కర్లు కొడుతోంది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో సెల్‌ఫోన్‌లలో లభించే ఆటలకే పరిమితం అవుతున్నారు. మిగతా వారి సంగతే అలా ఉంటే.. ఇక మన యువతరం సంగతి చెప్పేదేముంది. ఏ ఇద్దరు కలిసినా.. ఫేస్‌బుక్, వాట్సప్ ల గురించే చర్చ. ఒకప్పుడు రాత్రి 9గంటల్లోపు భోజనాలు ముగించుకుని నిద్రపోయేవారు. కోడికూయగానే లేచేవారు. అదే ఇప్పుడైతే.. స్టైల్‌తో పాటు లైఫ్ స్టైల్ కూడా మార్చేసింది మన యువతరం. అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్ చాటింగులతో గడుపుతున్నారు. ఆ చాటింగ్ లో ఎవరిని ఎవరు చీటింగ్ చేస్తున్నారో తెలియని పరిస్థితి. పొద్దునే మళ్లీ కాలేజీలకు, డ్యూటీలకు పరుగులు పెడుతున్నారు. మారిన లైఫ్‌స్టైల్‌ తో నిద్రకు సమయం దొరకడం లేదు. ఇది చాలదన్నట్లు ఎక్కడున్నా చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో మునిగిపోతున్నారు. ఈ పరిస్థితి నగర, పట్టణవాసుల్లోనే కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా మొదలైంది.

Image result for indian mobile youth

సెల్ చేస్తోన్న మాయాజాలం అంతా ఇంతా కాదు. మానవ సంబంధాలు మంటగలుపుతోంది. బంధువుల మధ్య దూరం పెంచుతోంది. అనునిత్యం అబద్ధాలు ఆడిస్తోంది. చిన్న పిల్లలకు పెద్దల సినిమాలు చూపిస్తోంది. మైదానాల్లో ఆడాల్సిన ఆటలను చేతుల్లో ఆడిస్తోంది. మానభంగాలు, హత్యలు, అత్యాచారాలను ప్రేరేపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు పెంచుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అవసరమైన, అవసరం లేని విజ్ఞానాన్ని బలవంతంగా రుద్దుతోంది. సెల్ మహత్యంతో ఈ మధ్య కాలంలో వివాహం అయిన 6 నెలల్లోనే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న యువ జంటలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో ఫోన్లలో అధిక పిక్సల్స్ కలిగిన ఫ్రంట్ కెమెరా రావడం వల్ల.. యువతకు సెల్ఫీల పిచ్చి పెరిగింది. ప్రమాదపుటంచుల్లో సెల్ఫీలు దిగి ఫెస్‌బుక్, వాట్సప్‌లో పోస్టులు చేస్తున్నారు. ఇదొక గొప్పగా ఫీలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫీలు దిగుతూ మరణించిన వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.

Image result for indian mobile youth

సాంకేతిక పరిజ్ఞానం ఉరకలేస్తున్న ప్రస్తుత తరుణంలో హై టెక్నాలజీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్‌ లో ఉన్న పోటీ కారణంగా పలు కంపెనీల ఫోన్‌లు చవక ధరలకే లభిస్తున్నాయి. ఫలితంగా సామాన్యుల నుంచి ధనికుల వరకు స్మార్ట్ ఫోన్ బాట పట్టారు. చిన్నపిల్లలైతే సెల్‌ఫోన్ చేతికి చిక్కిందంటే చాలు అందులో గేమ్స్ వెతికి పట్టుకుని నిమగ్నమైపోతున్నారు. పెద్దవాళ్లు సైతం ఇందుకు అతీతం కాదు. టెంపుల్ రన్, రేసర్, తీన్‌పత్తి, బోటింగ్, క్యాండిక్రష్, మోటోజీపీ వంటి అనేక రకాల గేమ్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. గేమ్ ఆడుతున్నంత సేపు ఏకాగ్రత ఆటపైనే కేంద్రీకృతం కావడం, తామే స్వయంగా గేమ్ అడుతున్నామనే అనుభూతి కలగడం సెల్‌ఫోన్ గేమ్స్ ప్రత్యేకత. ఫలితంగా సెల్‌ఫోన్ గేమ్స్ వైపు మొగ్గుచూపుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. టైంపాస్ కోసం మొదలవుతున్న సెల్‌ఫోన్ గేమ్స్ చివరకు వ్యసనంగా మారిపోతోంది. ఒక్కసారి గేమ్‌ ఓపెన్ చేస్తే చాలు తాము చేయాలనుకున్న పని ధ్యాసే లేకుండా కట్టిపడేస్తుంది. కార్యాలయాలు, బస్సులు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, బస్టాపులు ఇలా చోటేదైనా.. బోర్‌కొడితే చాలు సెల్‌ఫోన్ గేమ్ ఓపెన్ చేయడమే పరిపాటిగా మారింది.P.E.W రీసెర్చ్‌ సెంటర్‌ విశ్లేషణ ప్రకారం యువతీ యువకుల్లో దాదాపు 24 శాతం మంది ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూ.. ఆన్‌లైన్లో ఉంటున్నారు. తరచుగా స్నేహితులను కలవటం, మాట్లాడుకోవటం తగ్గిపోతోంది.

Image result for indian mobile youth

చాలామంది పార్టీలకు కూడా వెళ్లటం లేదు, విహార యాత్రలపై ఆసక్తి చూపడం లేదు. తల్లిదండ్రులతో కలిసి ఎక్కడైనా బయటకు వెళ్లే సందర్భాలు దాదాపు లేనట్లే. తల్లిదండ్రులకు వారు మానసికంగా దగ్గర కాలేకపోతున్నారు. ఒకే ఇంట్లోనే ఉన్నా విడివిడిగానే ఉండిపోతున్నారు. తల్లిదండ్రులు ఏదైనా చెప్పబోతున్నా.. ఏదో ఒకటి చెప్పి విషయాన్ని దాటవేసి సెల్‌ఫోన్‌లో లీనమైపోతున్నారు. ఇంతలా సెల్ ను వినియోగించడం వల్ల వారికి తగినంత నిద్ర కూడా ఉండటం లేదు. కుంగుబాటు సర్వసాధారణ సమస్యగా మారింది. యుక్తవయసులో స్వతహాగా కలిగే నైపుణ్యాలకు వారు దూరం అవుతున్నారు. చక్కగా మాట్లాడటం, ఎదుటివారిని కలవటం, తమనుతాము పరిచయం చేసుకోవటం, భావాలు పంచుకోవటం అనేది తగ్గిపోతోంది. తమకు కలిగిన భావావేశాన్ని ముఖంలో కనబరిచే బదులు స్మార్ట్‌ ఫోన్‌ నుంచి ఎదుటి వారికి ఒక 'ఎమోజీ' పంపేవిధంగా తయారవుతోంది నేటి యువతరం.మరి మొబైల్ వల్ల అంతా చెడేనా..? అంటే.. కాదనే సమాధానం వస్తుంది. ఒకప్పుడు డబ్బున్న వారికే పరిమితమైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్‌తో పనిలేకుండా అన్ని పనులను ఫోన్ లోనే చేసుకోగలుగుతున్నాం. ప్రపంచంలో ఏమూల ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే లైవ్‌ టీవీ ద్వారా అప్‌డేట్స్ తెలుసుకుంటున్నాం. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును వేరే అకౌంట్‌కు బదిలీ చేయడం, బిల్లు చెల్లింపు వంటి పనులన్నీ మొబైల్‌పైనే చక్కబెడుతున్నాం. తద్వారా సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. లక్షల అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచంలో ఎక్కడివారితోనైనా ముఖాముఖీగా మాట్లాడేస్తున్నాం.

Image result for MOBILE PHONES

నిరుద్యోగ యువతకు ఉద్యోగ సమాచారం కోసం మొబైల్ ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతోంది. జీవిత లక్ష్యం దిశగా పయనిస్తున్న ఎంతోమంది.. మొబైల్ లో స్టడీ మెటీరియల్ డౌన్ లోడ్ చేసుకుంటూ.. సివిల్స్, గ్రూప్సు, ఐబీపీఎస్, క్యాట్, గేట్ లాంటి పోటీ పరీక్షలకు కష్టపడి చదువుతూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి యువత సెల్‌ఫోన్ ద్వారా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని గ్రహించి తమ మేధస్సుకు పదును పెంచుకుంటున్నారు. ఇక ఆన్ లైన్ షాపింగ్‌ అయితే.. ఎంతో ఉపయోగకరంగా మారింది. అనేక వెబ్‌సైట్లలో మార్కెట్ ధరకంటే తక్కువ ధరకే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు లభిస్తున్నాయి. వివిధ వృత్తి, వ్యాపారాల్లో బిజీగా గడుపుతూ షాపింగ్‌కు వెళ్లే తీరిక లేనివారు తమకు కావాల్సిన వస్తువులను ఇంటర్‌నెట్‌లో చూసి ఫోన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. అయితే ఇలా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగకరంగా వాడుతున్న యువత కేవలం 20శాతమే అని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

Image result for indian mobile youth

లాభనష్టాల సంగతి పక్కన పెడితే.. యువతను స్మార్ట్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగం నుంచి దూరం చేయటం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదు. సోషల్‌ మీడియా వ్యసనం నుంచి బయటకు తీసుకురావటంకూడా కష్టమే. కానీ కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే కొంత మార్పురావచ్చనేది నిపుణుల మాట. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై యువతీయువకులు గడిపే సమయాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ రావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లపై రోజుకు గంట కంటే ఎక్కువ సమయం వెచ్చించకుండా జాగ్రత్త వహించాలి, మిగిలిన సమయంలో పుస్తకాలు చదువుకోవడం, స్నేహితుల్ని కలవటం, షికారుకు వెళ్లటం వంటి అలవాట్ల వైపు వారు మొగ్గుచూపే విధంగా చేస్తే మార్పు వస్తుంది. దీనివల్ల యవతను వేధిస్తున్న కుంగుబాటు సమస్య నుంచి సైతం బయట పడేయవచ్చు.

Image result for TELUGU POLICE USE PHONE

అలాగే.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే క్రమంలో ఎదురవుతున్న ఘటనలు, అసాంఘిక చర్యలను నివారించాలంటే పోలీసుల నిఘా ఎంతో అవసరం. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కామెంట్స్ ఆధారంగా అనేక మంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్న ఘటనలు అనేకమున్నాయి. ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వచ్చే కొన్ని పోస్టింగ్‌లతో మహిళలు, విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు. వేరొకరికి చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక తమలో తామే కుమిలి పోతున్నారు. చిన్నపిల్లలు, విద్యార్థులు సోషల్ మీడియాను వాడుతుంటే.. అ విషయంలో తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలి. SPOT…యవ్వనంలో ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు కీలకమే. ప్రతి నిర్ణయం భవిష్యత్తును శాసిస్తుంది. సమాజ భవిష్యత్తు కూడా యువశక్తి పైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఉపయోగకరమైన విషయాలకు మాత్రమే మొబైల్ ను వినియోగిస్తూ.. దానికి బానిస కాకుండా ఉండాల్సిన బాధ్యత యువతపై ఉందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: