అంతరిక్షం ఎన్నో అంతుచిక్కని ఆనవాళ్లకు నిలయం. అందులో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వీటి జాడకోసం అనేక దేశాలు తమ తమ స్పేస్ క్రాఫ్ట్ లను అంతరిక్షంలోకి పంపి అక్కడి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో తిరుగుతున్న బెన్ను గ్రహశకలాన్ని పరిశోధించేందుకు నాసా OSIRIS-REx spacecraftని పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ శాటిలైట్ బెన్ను గ్రహశకలాన్ని తొలిసారిగా అత్యంత దగ్గర నుంచీ ఫొటోలు తీసింది.


గ్రహశకలంపై మనిషి అవతారం, నాసా ఫోటోలో ఏముంది ?



భూమికి దగ్గరగా తిరుగుతున్న గ్రహశకలాల్లో ఒకటైన బెన్నూని... డిసెంబర్ 31న చేరింది స్పేస్ క్రాఫ్ట్. అప్పటి నుంచీ దాన్ని సమీపిస్తూ జూన్ 13న అత్యంత దగ్గరకు వెళ్లి అంటే 700 మీటర్ల దూరం నుంచీ గ్రహశకలం ఉపరితలాన్ని ఫొటోలు తీసింది. ఈ ఫొటోలో 1.6 అడుగుల దూరం కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ఎన్నో ఫొటోలను స్పేస్ క్రాఫ్ట్ నాసాకి పంపింది. వాటిని ఫిల్టర్ చేసే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.అయితే ఇది పంపిన ఫోటోలలో ఓ ఫోటో మిస్టరీ ఫోటోగా మారింది. దాన్ని నాసా బయటకు రిలీజ్ చేసింది.


అచ్చం మనిషి ముఖంలా భారీ రాయి

అచ్చం మనిషి ముఖంలా భారీ రాయి

నాసా రిలీజ్ చేసిన ఈ ఫొటోలో పైన కనిపిస్తున్న భారీ రాయి అచ్చం మనిషి ముఖంలా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ ఫొటోని చూసిన నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు తమ అభిప్రాయం చెబుతున్నారు. కొందరైతే... ఆ రాయిపై స్కెచ్ వేసి... అది నవ్వుతున్న మనిషి ముఖమే అంటున్నారు. నాసా ఇలాంటి ఫొటోలను రిలీజ్ చేసినప్పుడల్లా... ఇలాంటి ఊహాకల్పిత ఆలోచనలను పంచుకోవడం సహజమే. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అయ్యింది. మనిషి ముఖానికి సంబంధించి నాసా ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు.

తొలి మానవ నిర్మిత రోదసీ నౌక

తొలి మానవ నిర్మిత రోదసీ నౌక

రోదసీ పరిశోధనల కోసం నాసా ప్రయోగించిన 'ఓసిరిస్‌-రెక్స్‌' అనే అంతరిక్ష నౌక గతేడాది బెన్ను అనే ఒక గ్రహశకల కక్ష్యలోకి ప్రవేశించింది. అతి చిన్న గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తున్న తొలి మానవ నిర్మిత రోదసీ నౌకగా అది ఇప్పటికే రికార్డులకెక్కింది. ఈ గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తూ దానికి సంబంధించిన ధూళి నమూనాలతో ఓసిరిస్‌-రెక్స్‌ భూమికి తిరిగి వస్తుంది. రెండేళ్ల క్రితం రోదసిలోకి ప్రయోగించిన ఈ నౌక గత నెల 3న 11 కోట్ల కి.మీ దూరంలో వున్న గమ్య స్థానాన్ని చేరుకుంది.

బెన్నునే నాసా ఎందుకు ఎన్నుకుంది ?
 

బెన్నునే నాసా ఎందుకు ఎన్నుకుంది ?

ఈ ప్రయోగానికి ఏ గ్రహశకలాన్ని ఎంపిక చేయాలన్న ప్రశ్నకు నాసా శాస్త్రవేత్తలు బెన్ను ఆస్టరాయిడ్‌ కే ఓటేశారు. ఈ గ్రహశకలం భూమికి దగ్గరలో ఉండడం ఒక కారణం కాగా.. చిన్నపాటి కొండను పోలి ఉన్న దీని పరిమాణం అధ్యయనానికి అనుకూలమని పరిశోధకుల అభిప్రాయం. ఇది మరో కారణం నాసా గుర్తించిన పురాతన గ్రహశకలాలలో ఇదొకటి. సౌర కుటుంబంలోని 5 లక్షల గ్రహశకలాలను పరిశీలించిన తర్వాత బెన్నును నాసా ఎంపిక చేసింది.

నీరు పుష్కలంగా కలిగిన ఖనిజాలు

నీరు పుష్కలంగా కలిగిన ఖనిజాలు

ఇదిలా ఉంటే భూమికి చేరువలో ఉన్న గ్రహశకలం బెన్నులో నీరు పుష్కలంగా కలిగిన ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ‘ఒసైరిస్‌ రెక్స్‌' అనే వ్యోమనౌక అందించిన డేటా మేరకు దీన్ని నిర్ధరించారు. బెన్నులోని మూలకాలు శాస్త్రవేత్తలకు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఇలాంటి ఖగోళ వస్తువులే తొలినాటి భూమిపై నీరు, సేంద్రియ పదార్థాలను చేరవేసి ఉంటాయని భావిస్తున్నారు.

 ఈ గుట్టువీడితే

ఈ గుట్టువీడితే

భూమిపైకి నీరు ఎలా బట్వాడా అయ్యిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ గుట్టువీడితే సౌర కుటుంబం ఆవిర్భావంపై స్పష్టత వస్తుంది. 2020లో బెన్ను ఉపరితలంపై ఒసైరిస్‌ రెక్స్‌ కాలుమోపుతుంది. అక్కడి నమూనాలను సేకరించి, 2023లో భూమికి తిరిగొస్తుంది. అప్పుడు జరిగే పరిశోధనల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: