విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇస్రోతో కలిసి...నాసా కూడా దీని కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రుడిపై విక్రమ్ దిగిన ప్రాంతానికి నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు...హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్‌ విక్రమ్ ల్యాండర్ గురించి స్పేస్‌లో నిక్‌హేగ్‌ అనే ఆస్ట్రోనాట్‌తో మాట్లాడారు.  


చంద్రయాన్‌2 పై హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్‌ ఆరా తీస్తున్నారు. అంతరిక్షంలోని ఓ వ్యోమగామితో ఆయన మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన చంద్రయాన్‌2 వ్యోమనౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌ గురించి ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. జాబిల్లి ఉపరితలంపై నిస్తేజంగా ఉన్న విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఈ ల్యాండర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా హాలీవుడ్‌ ప్రముఖ హీరో బ్రాడ్‌పిట్‌ కూడా 'విక్రమ్‌' గురించి ఆరా తీశారు. ల్యాండర్‌ను చూశారా అంటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న అమెరికా వ్యోమగామికి ఫోన్‌ చేసి అడిగారు. 


వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయానికి వచ్చిన బ్రాడ్‌పిట్‌ అక్కడి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడియో కాల్‌ చేశారు. వ్యోమగామి నిక్‌ హేగ్‌తో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు.  అంతరిక్షంలోని పరిస్థితుల గురించి బ్రాడ్‌ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. 'గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది, అక్కడ లైఫ్‌ ఎలా ఉంది' లాంటివి అడిగారు. వీటన్నింటిపైనా నిక్‌ హేగ్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ 2 గురించి కూడా బ్రాడ్‌ పిట్‌ వ్యోమగామితో ప్రస్తావించారు. జాబిల్లిపై ల్యాండర్‌ విక్రమ్‌ను గుర్తించారా? అని అడగ్గా.. 'దురదృష్టవశాత్తు ఇంకా లేదు' అని నిక్‌ హేగ్‌ చెప్పారు. 


బ్రాడ్‌పిట్‌ హీరోగా 'ఆడ్‌ ఆస్ట్రా' పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బ్రాడ్‌ వ్యోమగామి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నాసా కేంద్రానికి వెళ్లిన ఆయన.. వ్యోమగామి నిక్‌ హేగ్‌తో మాట్లాడారు. ఈ వీడియో కాల్‌ను నాసా టీవీలో ప్రసారం చేశారు. బ్రాడ్‌ వ్యోమగామితో మాట్లాడుతున్న వీడియోను నాసా ట్విటర్‌లోనూ షేర్‌ చేశారు. 


మరోవైపు...చంద్రుడిపై హార్డ్‌ ల్యాండ్ అయిన విక్రమ్‌ ఫొటోలు తీసేందుకు నాసా ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతంపైకి నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉపగ్రహం చంద్రుడి ఉపరితలానికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలను భారత్‌కు అందజేస్తుంది. ఫలితంగా ల్యాండర్‌ తాజా స్థితిగతులపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగేందుకు ప్రయత్నించిన చంద్రయాన్‌-2 వ్యోమనౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌కు చివరి నిమిషంలో భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. అది చంద్రుడి ఉపరితలంపై మృదువుగా కాకుండా గట్టిగా ఢీకొన్నట్టు దిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. విక్రమ్‌తో కమ్యూనికేషన్లు ఏర్పరచుకునేందుకు నాసాతో కలసి ప్రయత్నిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: