భారతి ఎయిర్ టెల్ కస్టమర్లకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. 599 రూపాయల ప్లాన్ రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 4 లక్షల రూపాయల జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు. కస్టమర్లు 599 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు పొందవచ్చు. 
 
ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. భారతి ఎయిర్ టెల్ భారతి యాక్సా లైఫ్ తో ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు. 18 నుండి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కస్టమర్లకు ఈ జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. కస్టమర్లకు ఎలాంటి వైద్య పరీక్షలు కానీ ఎలాంటి మెడికల్ చెకప్ లు కానీ ఉండవు. ఈ బీమా ప్రయోజనాన్ని పొందాలనుకునే కస్టమర్లు తొలి రీచార్జ్ చేసిన తరువాత ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లేదా ఎయిర్ టెల్ రిటైలర్ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
బీమా కవరేజీ రీచార్జ్ చేసుకున్న రోజునుండి ప్రతి రీచార్జ్ తో ఆటోమేటిక్ గా మూడు నెలలు కొనసాగుతుంది. ప్రస్తుతం భారతి ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టింది. ఎయిర్ టెల్ మిగతా ప్రాంతాలకు కూడా ఈ ఆఫర్ ను క్రమంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. భారతి ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 
 
ప్రైవేట్ టెలికాం రంగంలో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొంది. ఇలాంటి కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టటం ద్వారా కంపెనీలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఎయిర్ టెల్ తన కస్టమర్ల కొరకు 4 లక్షల రూపాయల జీవిత బీమా ప్రకటించటంతో మిగతా ఆపరేటర్లు కూడా తమ కస్టమర్ల కొరకు కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశాలు ఐతే ఉన్నాయని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: