ఇస్రో చేపట్టబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గగన్‌యాన్‌కు ఎంపికైన 60 మందిలో 12 మంది పైలట్లను పక్కనపెట్టేసింది. దంత సమస్యల కారణంగానే వారిని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించింది. అక్కడి వాతావరణానికి పళ్ల సమస్య ఉంటే సరిపోరని తేల్చేసింది.


గగన్‌యాన్‌ శిక్షణ కోసం తొలుత భారత్‌ షార్ట్‌ లిస్ట్‌ చేసిన 60 మంది పైలట్లలో 12 మంది దంత సమస్యల కారణంగా  ఇంటిదారి పట్టారు. చాలా మంది భారత పైలట్లకు రష్యా శిక్షణకు నిరాకరించడానికి దంత సమస్యలే అడ్డుగోడుగా నిలిచాయి. ఈ విషయాన్ని ఐఏఎఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ నిపుణులు తెలిపారు. ఇస్రో 1982-84 తర్వాత మళ్లీ ఇప్పుడు వ్యోమగాములను ఎంపిక ప్రక్రియను చేపట్టింది. 


దంత సమస్యలు అంతరిక్షంలో వ్యోమగాములకు చాలా సమస్యలను సృష్టిస్తాయి. దీంతో భారతీయ పైలట్లను ఎంపిక చేసేటప్పుడే ఎటువంటి దంత సమస్యలు ఉండకూడదని రష్యా నిపుణులు ఖచ్చితంగా చెప్పారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ కూడా ఈ విషయంలో కఠినంగా ఉంటుంది. అక్కడి వ్యోమగాములు దంతాల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. వ్యోమనౌక గాల్లోకి ఎగిరేసమయంలో తీవ్రమైన ఒత్తిడి, ప్రకంపనలను ఎదుర్కొంటారు. దీంతో ఆ సమయంలో సరిగాలేని దంతాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. దీంతోపాటు అంతరిక్షంలోకి వెళ్లాక శరీరంపై ఒత్తిడి కూడా మారుతుంది. దీంతో పుచ్చుపళ్లు ఉంటే తీవ్ర నొప్పిని పుట్టిస్తాయి. 1978లో రష్యా ఆస్ట్రోనాట్‌ యూరీ రోమినికో ఈ సమస్యతో తొలిసారి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దంత సమస్యలతో పాటు వినికిడి, దృష్టిలోపాలను కూడా వ్యోమగాముల ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. 

 

గగన్‌యాన్‌కు సంబంధించి రష్యా సహకారాన్ని భారత్‌ తీసుకుంటోంది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగాములకు ఆ దేశం శిక్షణ  ఇస్తోంది. యూరీ గగారిన్‌ కాస్మోనాట్‌ సెంటర్లో శిక్షణ మొదలైంది. ఇప్పటికే ఏడుగురు శిక్షణ పూర్తి చేసుకొన్నారు. వీరు భారత్‌కు చేరుకున్నారు. వీరికి ఫైనల్‌ ట్రైనింగ్‌  ఇంకా ఇవ్వాల్సి ఉంది. మరో 36 మందిని ట్రైనింగ్‌ కోసం ఐఏఎఫ్‌ ఎంపిక చేసింది. ఈ పైలట్లలో కూడా  అతికొద్ది మందే ఫైనల్‌ స్టేజ్‌కి ఎంపిక కానున్నారు. ఫైనల్‌ స్టేజ్‌ కోసం 12మందిని ఎంపిక చేయనుంది ఇస్రో. ఎంతో టఫ్‌గా ఉండే ఈ ట్రైనింగ్‌లో బెస్ట్‌ ఫెర్‌ఫార్మెన్‌ చూపించిన  ముగ్గురిని 2022లో గగన్‌యాన్‌ పాజెక్టుకు ఎంపిక చేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: