భారతదేశంలోని టెలికాం కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ 74,000 కోట్ల రూపాయల నష్టాలను ఇప్పటికే ప్రకటించాయి. టెలికాం రంగంలో జియో రాకతో మిగతా కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చాయి. ఈ కంపెనీలకు భారీగా రుణాలు పేరుకుపోయాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ కంపెనీలు నష్టాలను తగ్గించుకోవటానికి కాల్ చార్జీలను పెంచబోతున్నాయని సమాచారం. డిసెంబర్ 1వ తేదీ నుండి కాల్ చార్జీలను పెంచనున్నట్లు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రకటించాయి. 
 
వొడాఫోన్ ఐడియా నిన్న డిసెంబర్ నెల 1వ తేదీ నుండి సముచిత స్థాయిలో టారిఫ్ లను పెంచబోతున్నామని ప్రకటన చేసింది. అంతర్జాతీయ స్థాయి డిజిటల్ సేవలను అందించటం కొరకు టారిఫ్ పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటన చేసింది. వొడాఫోన్ ఐడియా ప్రకటన చేసిన తరువాత భారతీ ఎయిర్ టెల్ కూడా డిసెంబర్ నెల నుండి చార్జీలను పెంచబోతున్నట్లు ప్రకటన చేసింది. 
 
టెక్నాలజీకి తగ్గట్టుగా టెలికాం రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఎయిర్ టెల్ పేర్కొంది. టెలికాం పరిశ్రమ లాభదాయకంగా ఉంటే మాత్రమే డిజిటల్ ఇండియా కల సాకారం అవుతుందని పేర్కొంది. ఒక నెట్ వర్క్ నుండి మరో నెట్ వర్క్ కు కాల్ చేసిన సమయంలో విధించే ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను జియో తొలగించాలని కోరుతూ ఉండగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రం తొలగించవద్దని కోరుతున్నాయి. 
 
మరోవైపు టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారీగా బకాయిలు కట్టాల్సి ఉండటంతో రుణాలు కొన్ని నెలలపాటు కట్టకుండా వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీల విషయంలో త్వరలో కొత్త విధానాన్ని ప్రకటిస్తామని ట్రాయ్ తెలిపింది. 2020 జనవరి నెల 1వ తేదీ నుండి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: