ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా డిసెంబర్ నెల 1వ తేదీ నుండి నష్టాలను తగ్గించుకోవటం కొరకు కాల్ చార్జీలను పెంచబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశాయి. ఉచిత ఆఫర్లతో టెలికాం రంగంలోకి ప్రవేశించిన జియో కూడా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా దారిలోనే పయనిస్తోంది. మరికొన్ని వారాల్లో జియో కూడా టారిఫ్ ధరలను పెంచబోతున్నట్లు ప్రకటన చేసింది. 
 
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కాల్ చార్జీలను పెంచబోతున్నట్లు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే జియో కూడా ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీల కింద జియో ఇప్పటికే నిమిషానికి ఆరు పైసల చొప్పున కస్టమర్ల నుండి వసూలు చేస్తోంది. జియో తీసుకున్న తాజా నిర్ణయం జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ప్రభుత్వంతో కలిసి ఇతర ఆపరేటర్లలాగే తాము కూడా పనిచేస్తామని జియో పేర్కొంది. 
 
ట్రాయ్ టెలికాం పరిశ్రమను బలోపేతం చేయటంతో పాటు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చటానికి తీసుకునే చర్యలకు జియో కూడా కట్టుబడి ఉంటుందని పేర్కొంది. మరికొన్ని వారాల్లో డిజిటలైజేషన్, డేటా వినియోగానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాము కూడా టారిఫ్ రేట్లను పెంచుతున్నామని ముఖేశ్ అంబానీ సంస్థ ప్రకటన చేసింది. టెలికాం రంగంలో జియో రాకతో టెలికాం కంపెనీలకు భారీగా నష్టాలు వచ్చాయి. 
 
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 74,000 కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించాయి. వొడాఫోన్ ఐడియా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ సేవలను అందించటం కొరకు టారిఫ్ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసింది. ఎయిర్ టెల్ టెక్నాలజీకి తగ్గట్టుగా భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని అందువలన టారిఫ్ రేట్లను పెంచబోతున్నట్లు ప్రకటన చేసింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: