మన దేశంలో  స్మార్ట్‌ఫోన్స్ వాడే వారి సంఖ్య  బాగా పెరిగింది, స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయినా  ఇంకా దేశంలో 50 కోట్ల ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారు. తక్కువ ఆదాయం ఉన్న వారు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను ఉయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు బాగా పెరిగాయి.భారత్‌లో ఇప్పుడు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు ఏకంగా 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో ఫీచర్ ఫోన్ లావాదేవీలు 10 లక్షల కన్నా తక్కువగానే ఉన్నాయి.

 నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం పేమెంట్ సేవలు మరింత అందుబాటులోకి తెచ్చేలా  కాంటెస్ట్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది.ఎన్‌పీసీఐ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, సీఐఐఈ.కో సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఈ పోటీని నిర్వహిస్తోంది. ఇందులో గెలిచిన వారు 50,000 డాలర్లు గెలుచుకోవచ్చు. మన కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ.35 లక్షలు ఇంటికి పట్టుకెళ్లొచ్చు.ఫీచర్ ఫోన్ యూజర్లు లక్ష్యంగా వారికి అనువైన పేమెంట్ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. పేమెంట్ సేవలకు సంబంధించి సులభమైన, సరళరంగా ఉన్న, అధిక భద్రతతో కూడిన సర్వీసులు లక్ష్యంగా మంచి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను రూపొందించాలి. ఎన్‌పీసీఐ ఈ ఛాలెంజ్‌లో భాగంగా రియల్ టైమ్‌లో సమస్య పరిష్కారం, మెరుగైన పేమెంట్ ఇంటర్‌ఫేస్ అండ్ వర్క్‌ఫ్లో, ఇంటిగ్రేటెడ్ బిల్ పేమెంట్ ఫీచర్స్, పీ2పీ  మర్చంట్ పేమెంట్ సొల్యూషన్స్, మెరుగైన భద్రత, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి పలు సేవలు అందించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయంగా ఎవరైనాసరే పోటీలో పార్టిసిపేట్ చేయొచ్చు. వ్యక్తులు, సంస్థలు ఈ పోటీలో పాల్గొనవచ్చు.విజేతగా నిలిచిన వారికి దాదాపు రూ.35 లక్షలు అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి దాదాపు రూ.22 లక్షలు లభిస్తాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన వారికి దాదాపు రూ.15 లక్షలు వస్తాయి. ఈ పోటీలో పాల్గొనాలని భావిస్తే అప్లై చేసుకోవాలి. దరఖాస్తులకు జనవరి 12 చివరి తేదీ. అప్లికేషన్స్‌ను కేవలం ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు. సీఐఐఈ.కో, ఎన్‌పీసీఐ సంస్థలు అభ్యర్థులను లేదా సంస్థలను ఎంపిక చేస్తాయి. ఎంపికైనవారు వారి ప్రొడక్ట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అవసరమైన సేవలే అందిచాలి. టెక్నికల్ సపోర్ట్ ఇవాలి.

ఎన్‌పీసీఐ ఫిబ్రవరి 11న శాండ్‌బాక్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఇక్కడ ఎంపికైన స్టార్టప్స్, వ్యక్తులను సంస్థ వెల్లడిస్తుంది. తర్వాత వీరికి ఎన్‌పీసీఐ ఏపీఐ యాక్సెస్ లభిస్తుంది. సొల్యూషన్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు వీరికి ఎన్‌పీసీఐ నిపుణులు తగిన సహాయం అందిస్తారు. మార్చి 14 విజేత ఎవరనేది తెలుస్తుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: