బుడి బుడి నడకలతో అంతరిక్షయానాన్ని ప్రారంభించిన షార్‌... ఇప్పుడు విదేశీ ఉపగ్రహ వాణిజ్యంలో దూసుకుపోతోంది. రేపు 50వ పీఎస్‌ఎల్వీ వాహననౌకను ప్రయోగించనుంది. ఇప్పటి వరకూ 310కి పైగా విదేశీ వాణిజ్య ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపింది. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది.

 

శ్రీ హరికోటలోని సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్.. ఎన్నో వందల ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. వరుస విజయాలతో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. షార్‌.. ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది. బుధవారం 50వ పి.ఎస్.ఎల్.వి  ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇప్పటికే షార్‌లోని మొదటి లాంచింగ్ పాడ్ పై వాహక నౌక అనుసంధాన పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుంచి  26 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ వాహక నౌక ద్వారా రిశాట్‌-2 బి.ఆర్ 1తో పాటు 9 వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది ఇస్రో. బుధవారం సాయంత్రం 3 గంటల 25 నిముషాలకు షార్‌లోని మొదటి లాంచ్ పాడ్‌ నుంచి ప్రయోగం జరగనుంది. అమెరికాకు చెందిన 6, ఇజ్రాయెల్ , ఇటలీ, జపాన్ లకు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. 

 

ప్రతిష్టాత్మక ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ప్రతీ చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సెంటిమెంట్ గా పి.ఎస్.ఎల్.వి.సి సిరీస్‌లోని 13వ నెంబర్‌ను వాడడం లేదు. మొదట పి.ఎస్.ఎల్.వి వాహకనౌకను షార్‌ నుంచి 1993 సెప్టెంబరు 20న ప్రయోగించారు. ఇది విఫలమైంది. మూడో తరం రాకెట్‌గా వచ్చిన పీఎస్‌ఎల్‌వీ వాహకనౌకలను... వరుసగా పి.ఎస్.ఎల్.వి-డి1, పి.ఎస్.ఎల్.వి.డి-2, పి.ఎస్.ఎల్.వి డి 3  పేర్లతో నింగిలోకి పంపారు. ఆ తర్వాత నుంచి పి.ఎస్.ఎల్.వి-సి1 సీరీస్‌తో ప్రయోగాలు ప్రారంభించారు. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ చాలా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. పి.ఎస్.ఎల్.వి-సి11 ద్వారా 2008 అక్టోబరు 22న చంద్రయాన్‌-1, పి.ఎస్.ఎల్.వి-సి25 ద్వారా 2013 నవంబరు 5న మంగళయాన్‌ ఉపగ్రహాలను షార్‌ రాకెట్‌ కేంద్రం నుంచి నింగిలోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా పంపారు. పి.ఎస్.ఎల్.వి-సి37 వాహకనౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సాధించారు. 

 

ఉపగ్రహ పరీక్షల వ్యాపారంలోనూ ఇస్రో దూసుకుపోతుంది. దేశ అవసరాలకు అవసరమైన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడమేకాకుండా... విదేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపి ఆదాయాన్ని సంపాదిస్తోంది. 20 ఏళ్లలో ఇస్రోలోని యాంత్రిక్స్‌ సంస్థ 310 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. మూడేళ్లలో ఇస్రో యాంత్రిక్స్‌ సంస్థ 239 విదేశీ ఉపగ్రహాలను పంపి రూ.6 వేల 280 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: