చలికాలం కదా! చలికోటు కొందామనుకున్నాడు ఒకరు. రేట్లు ఎలా ఉన్నాయో గూగుల్‌లో వెతికాడు. ఆ తరువాత అతను ఎప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసినా.. ఏ వెబ్‌సైట్ తెరచినా వివిధ రకాల చలికోట్లు, వాటి ధరలకు సంబంధించిన ప్రకటనలు తెరపై కనిపిస్తున్నాయి.ఈ అనుభవం మీకు కూడా కలిగే ఉంటుంది కదూ! మరి ఇదెలా సాధ్యం? మనం సెర్చ్ చేసిన సమాచారం వారికెట్లా తెలుస్తోంది? మన సమాచారం ఇతరులకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? పదండి ఆ వివరాలను తెలుసుకుందాం.

 

"గూగుల్ సేవలు వినియోగించుకుంటున్నారా? అయితే మీ డేటా భద్రంగా ఉంటుంది. ఈ విషయంలో మీరు మమ్మల్ని నమ్మొచ్చు." గూగుల్ ప్రైవసీ నియమ, నిబంధనల్లో సాధారణంగా మీరు చూసే తొలి వాక్యం ఇది. అయితే మీకు ఒక విషయం తెలిసి ఉండక పోవచ్చు. అదే గూగుల్ "మై యాక్టివిటీ".గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది. దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయి. ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తుంటాయి.

 

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ ప్రపంచంలో విహరించే వాళ్లకు దాదాపు జి-మెయిల్ ఉంటుంది. అంటే మీకు గూగుల్‌లో ఒక ఖాతా ఉందన్నమాట. గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌తో ఈ ఖాతా అనుసంధానమై ఉంటుంది. గూగుల్‌లో మీరు ఏం వెతికినా, ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది. ఏ ప్రాంతంలో ఉన్నా, కంప్యూటర్ ఏదైనా ఈ డేటాను "మై యాక్టివిటీ" సేకరిస్తుంది.

 

ఈ డేటాను తొలగించాలంటే గూగుల్ లో మై యాక్టివిటీ లింక్‌ను తెరవండిమై యాక్టివిటీ లింక్‌పై క్లిక్ చేయగానే "గూగుల్ మై యాక్టివిటీ" అనే విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో పై భాగంలో సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు వెతికిన వెబ్‌సైట్ల వివరాలను తెలుసుకోవచ్చు. వాటిని డిలీట్ చేయొచ్చు.లేదా తేదీల వారీగా కూడా బ్రౌజింగ్ హిస్టరీని తొలగించవచ్చు. లేదా మొత్తం సమాచారాన్ని ఒకేసారి డిలీట్ చేసే ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ సమాచారాన్ని డిలీట్ చేసేటప్పుడు గూగుల్ మిమ్మల్ని తదుపరి పరిణామాలపై హెచ్చరిస్తుంది.

 

బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయడం ద్వారా పెద్ద నష్టమేమీ ఉండదు. మీ గూగుల్ ఖాతా, ఇతర అప్లికేషన్ల పనితీరుపై ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపదు. యూట్యూబ్‌లో మీరు వెతికే ప్రతి వీడియో సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. ఈ చరిత్రను కూడా సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ లింక్‌పై క్లిక్ చేయండి. ఎడమ వైపున "హిస్టరీ" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ", "క్లియర్ వాచ్ హిస్టరీ" వాటిని ఎంచుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: