కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం స్మార్ట్​ ఫోన్లపై పడింది. ఫీచర్​ ఫోన్​ విడిభాగాలకు ధరలు పెరగనుండడంతో ఫోన్ ధరలకు రెక్కలు రానున్నాయి. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)పై ప్రభుత్వం 20 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సుంకం పది శాతంగా ఉంది. ఇప్పుడది రెట్టింపు కావడంతో ఆ మేరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా వీటి ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


 
ఓ వైపు జీఎస్టీ, మరోవైపు కస్టమ్స్ సుంకంతో ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ ప్రభావం ఫోన్ల కొనుగోలుపై పడనుంది. సెల్​ రిపేరు వచ్చినా వినియోగదారుడి జేబుకు చిల్లుపెడేలా ధరలు పెరుగుతాయని ఆర్థికవేత్తలు విశ్లేసిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 300 మిలియన్ పీసీబీఏ యూనిట్లు వినియోగంలోకి వస్తున్నాయి. వీటిలో 160 మిలియన్ యూనిట్లను స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్నారు. ఇవన్నీ స్థానికంగానే ఉత్పత్తి అవుతుండగా, ఫీచర్ ఫోన్లలో ఉపయోగిస్తున్న వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడు వాటి దిగుమతి సుంకం పెరగడంతో ఆ మేరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 


దేశీయంగా స్పెర్​ పార్ట్స్​ తయారీ కేంద్రాలు ఉన్న మొబెల్ కంపెనీలపై అంతగా ప్రభావం లేకపోయినా ఖరీదైన ఫోన్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాల ప్రభావం భారీగా ఉండనుంది. అయితే, దేశీయ యూనిట్లు పీసీబీఏల ఉత్పత్తిని కనుక ప్రారంభిస్తే వాటి ధర తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. స్థానిక తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న పీసీబీఏల విలువ లక్ష కోట్ల రూపాయలు కాగా, దిగుమతి చేసుకుంటున్న వాటి విలువ రూ.6 వేల కోట్లు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: