ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తాజాగా మ‌రో కొత్త యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ తదితర పేరున్న యాప్స్ కు మాతృసంస్థగా ఉన్న ఫేస్ బుక్.. ‘HOBBI’ అనే పేరుతో కొత్త యాప్‌ను విడుదల చేసింది. హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త యాప్ ను రూపొందించింది. ఫేస్ బుక్ కంపెనీలో భాగమైన ‘న్యూ ప్రొడక్ట్ ఎక్స్ పెరిమెంటేషన్ (ఎన్ పీఈ) టీమ్ ఆధ్వర్యంలో ఈ యాప్‌ని రూపొందించినట్టుగా యాప్ డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు.

 

ఇక పెద్దగా ప్రచారమేమీ లేకుండా సైలెంట్ గా ఈ యాప్ ను విడుదల చేశారు. దాంతో శుక్రవారం సాయంత్రం వరకు హాబీ యాప్‌ను ఐదువేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ యాప్ కేవలం యాపిల్ ఐఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది.  అంతేకాదు కేవలం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే దీన్ని విడుదల చేశారు. త్వరలోనే అన్ని దేశాల వారికి అందుబాటులోకి రానుంది. అలాగే ఆండ్రాయిడ్‌ యాప్‌ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

 

 ఇక ఈ యాప్ మన హాబీలను, ఐడియాలను షేర్ చేసుకునే యాప్. మనకు ఇష్టమైన పనులు గార్డెనింగ్,  ఆర్ట్స్, వంట, డెకరేషన్ ఇలాంటి హాబీలను ఓ క్రమంలో సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యూజర్లు తమ కలెక్షన్లు, ప్రాజెక్టులను ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ తోడ్పడుతుందని ఫేస్ బుక్ సంస్థ వెల్ల‌డించింది. ఈ కలెక్షన్లు, ప్రాజెక్టులు పూర్తయ్యాక.. వీడియో హైలైట్ రీల్స్ రూపొందించుకోవచ్చని, వాటిని మరికొందరు యూజర్లతో షేర్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, ఇప్పటికే ఇదే తరహాలో అందుబాటులో ఉన్న ‘Pinterest’ యాప్‌లాగే హబీ యాప్‌ కూడా పనిచేస్తుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: