ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 70 ల‌క్ష‌లు దాటేసిందంటే.. ఈ వైర‌స్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే గూగుల్ సెర్చ్‌లోనూ క‌రోనా హ‌వానే కొన‌సాగుతోంది. గూగుల్... అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. ఏ చిన్న అనుమానం వచ్చినా గూగుల్‌లో వెతకడం నెటిజన్లకు అలవాటు అయిపోయింది. 

 

ఇక ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే చాలు... దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కరోనా వైరస్‌ కలకలంతో మే నెలలో లాక్‌డౌన్‌ 4.0 గూగుల్‌ టాప్‌ ట్రెండింగ్‌ సెర్చ్‌గా నిలిచింది. కరోనా కట్టడికి మార్చి 24న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 17 నాటికి మూడు దశలు పూర్తయి మే 18న నాలుగో దశలోకి అడుగుపెట్టే క్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రభుత్వం వెల్లడించే తాజా మార్గదర్శకాలను తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించిన‌ట్టు తెలుస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే మేలో ‘లాక్‌డౌన్‌ 4.0’ పదం సెర్చ్‌ 3150 శాతం పెరిగింది. ఆ తర్వాత స్ధానంలో ‘ఈద్‌ ముబారక్‌’ నిలిచింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెర్చ్‌ ట్రెండ్స్‌ను గూగుల్ తాజాగా వెల్లడించింది. అలాగే `కరోనావైరస్‌ లాక్‌డౌన్‌ జోన్స్‌ ఢిల్లీ` అంటూ గూగుల్‌ సెర్చ్‌లో వెతికిన వారి సంఖ్య మే నెలలో 1800 శాతం పెరిగింది. ఇక ఏప్రిల్‌లో మూడో టాప్‌ సెర్చింగ్‌ పదంగా నిలిచిన కరోనావైరస్‌ ఆ తర్వాత 12వ స్ధానానికి పడిపోయింది. అయితే దేశంలో భారీ క్రేజ్ ఉన్న‌ క్రికెట్‌తో పోలిస్తే కరోనావైరస్‌ గురించి సెర్చ్‌ ఇప్పటికీ అయిదు రెట్లు అధికంగా ఉందని గూగుల్ వెల్ల‌డించింది. మ‌రోవైపు గూగుల్‌లో కరోనా వైరస్‌ సంబంధిత టాప్‌ ట్రెండింగ్‌ టాపిక్‌గా వ్యాక్సిన్‌కు చోటు దక్కింది. మేలో వ్యాక్సిన్‌ పదం సెర్చి 190 శాతం పెరిగిందని తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: