నేటి కాలంలో గూగుల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ఎందుకంటే.. గూగుల్ అందించే రకరకాల సేవల్ని మ‌న ఉప‌యోగించుకుంటాం. ఇమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్ ఇలా గూగుల్ అనేక రకాల సేవల్ని అందిస్తుంది. అందుకే గూగుల్... అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. ఇక ఈ ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. అందరూ గూగుల్‌లోనే సెర్చ్ చేస్తుంటారు. ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే చాలు..దాని గురించి గూగుల్‌లో తెగ వెతికేస్తుంటారు. కంప్యూటర్‌లో అయినా, స్మార్ట్‌ ఫోన్‌లో అయినా గూగుల్ సెర్చ్‌‌ చేయటం ఇప్పుడు అందరికీ అలవాటయిన పని. అయితే దీన్నే సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 

 

వివిధ  కంపెనీలు, సంస్థలు, బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో కాంటాక్టు నంబర్లు అందుబాటులో ఉంచుతారు. అయితే ఆ కంపెనీల కస్టమర్‌ కేర్ నంబ‌ర్ల స్థానంలో సైబర్‌ నేరగాళ్లు తమ ఫోన్‌ నంబర్లు పెడుతున్నారు. ఇక  బాధితులు కస్టమర్‌ కేర్‌ నంబర్‌ అని గూగుల్‌లో వెతకగానే సైబర్‌నేరగాళ్లు రూపొందించిన పేజీలు కనబడటంతో.. నిజమేనని నమ్మి ఆ నంబర్లనే సంప్రదిస్తూ.. సైబర్‌ నేరగాళ్ల చేతిలోపడి మోసపోతున్నారు. తాజాగా ప్రైవేట్‌ ఉద్యోగం చేసే ర‌వి‌... తన కూతురి కోసం ఆన్‌లైన్‌లో కొన్ని పుస్తకాలు ఆర్డర్‌ చేశాడు. అనంతరం ఫలాన కొరియర్‌ నుంచి పంపిస్తున్నామంటూ ర‌వికి సమాచారం వచ్చింది. కానీ, వారం రోజులైనా రాకపోవడంతో సంబంధిత కొరియర్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవాలనుకున్నాడు. 

 

దీంతో గూగుల్‌లో సెర్చ్‌ చేసి.. అందులో సదరు కొరియర్‌ సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ అంటూ ఉండగా దాన్ని సంప్రదించాడు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తులు లాక్‌డౌన్‌ కారణంగా కొరియర్‌ పంపించలేకపోతున్నాం. మీ డబ్బులు తిరిగి పంపిస్తాం.. మీ బ్యాంకు ఖాతా నంబర్‌ పంపించండి అంటూ అన్ని వివరాలు తెలుసుకొని.. అతడి ఖాతా నుంచి రూ.1.3 లక్షలు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఇలా ర‌వి‌ ఒక్కడే కాదు... చాలామంది సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. అందుకే గూగుల్‌లో నెంబర్లు సెర్చ్ చేసి.. ఆయా సంస్థలకు ఫోన్‌ చేసినప్పుడు.. బ్యాంకు ఖాతాలు, ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. ఎందుకంటే.. అసలైన సంస్థలకు చెందినవారు బ్యాంకు ఖాతా, డెబిట్‌కార్డు వివరాలు అడగరు.

మరింత సమాచారం తెలుసుకోండి: