వారం రోజుల్లోనే మ‌న భార‌త దేశ సాంకేతిక నైపుణ్యం స‌త్తా ఏంటో చైనాకు తెలిసి వ‌చ్చింది. వాస్త‌వంగా ప్ర‌పంచంలో ఇత‌ర దేశాల‌తో పోలిస్తే యాప్స్‌, సాంకేతిక నైపుణ్యంలో మ‌న‌దేశం కాస్త వెన‌క‌ప‌డి ఉంద‌ని చాలా మంది అనుకుంటారు. ఇత‌ర దేశాల యాప్స్‌కు పోటీగా మ‌న వాళ్లు కూడా ప‌లు యాప్స్ క్రియేట్ చేసినా ఇత‌ర దేశాల యాప్స్ అప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ఉండ‌డంతో మ‌న‌వి కాస్త వెన‌క‌ప‌డి న‌ట్లు ఉంటాయి. ఇక కొద్ది రోజుల క్రితం మన దేశంలో చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌న దేశంలో వీటికి ప్ర‌త్యామ్నాయంగా ఉన్న యాప్‌ల‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. 

 

మ‌న వాళ్లు అంద‌రూ భార‌తీయ యాప్‌ల‌కు జై కొడుతున్నారు. బెంగళూరు టెకీలు అభివృద్ధి చేసిన షేర్‌చాట్‌ ఏకంగా గంటకు 5 లక్షల డౌన్‌లోడ్లను నమోదు చేసుకుంది. షేర్‌చాట్‌ను 1.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయ యాప్‌ అయిన రోపోసో, చింగారీలకు కూడా డిమాండ్‌ భారీగా పెరిగింది. రెండురోజుల్లో కోటి మంది యూజర్లు రోపోసోను ఇన్‌స్టాల్‌ చేసుకోగా.. చింగారీ తాజా డౌన్‌లోడ్ల సంఖ్య 78.4 లక్షలుగా నమోదైంది.

 

చింగారీని గంటకు 3 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం గమనార్హం. మహీంద్రా గ్రూప్‌కు చెందిన గోసోషల్‌ యాప్‌ డౌన్‌లోడ్లలో 20 శాతం పెరుగుదల న‌మోదు అయ్యింది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే మ‌న దేశం మొబైల్ యాప్ మార్కెట్లో ఏకంగా నాలుగో స్థానానికి ఎగ‌బాకింది. ఏదేమైనా వారం రోజుల్లోనే మ‌న స‌త్తా ఏంటో మొత్తానికి చైనాకు తెలిసి వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: