యూట్యూబ్ ప్రత్యేకంగా భారతీయుల కోసం ఓ స్పెషల్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. మొబైల్ ద్వారా వీడియోల్ని చూడడం  వల్ల భారీ మొత్తంలో డేటా ఖర్చవుతుంది కాబట్టి రాత్రిళ్లు డేటా ఛార్జీలు తక్కువగా ఉండే సమయంలో యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్ అయ్యే విధంగా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

ఇప్పటివరకూ భారతీయ యూజర్లు యూట్యూబ్ వీడియోల్ని చూసే సమయంలో డేటా పెద్దగా ఖర్చవకుండా ఉండడం కోసం Settings ద్వారా తక్కువ  రిజల్యూషన్ ఫార్మేట్‌ని ఎంపిక చేసుకుని తక్కువ క్వాలిటీలో వీడియోల్ని చూస్తుండే వారు. దీనివల్ల నాణ్యమైన వీడియోల్ని చూసే సంతృప్తిని కోల్పోవలసి వచ్చేది.

అయితే తాజాగా SmartOffline పేరుతో యూట్యూబ్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అర్థరాత్రిళ్లు మొబైల్ డేటా పూర్తి ఉచితంగా కానీ, తక్కువ ధరతో గానీ లభించే సమయంలో మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా మనం ఎంపిక చేసుకున్న వీడియోలు రాత్రి సమయాల్లో డౌన్‌లోడ్ చేయబడి ఫోన్లో సేవ్ చెయ్యబడతాయి.  ఉదయం మనం నిద్ర లేచేసరికి వీడియోలు చూడడానికి సిద్ధంగా ఉంటాయి.

గూగుల్ ఈ సదుపాయాన్ని ఎయిర్‌టెల్, టెలీనార్ యూజర్లకి అందుబాటులోకి తీసుకు రానుంది. ఇండియాలోని ఇతర సెల్‌ఫోన్ ఆపరేటర్లకి క్రమేపీ ఇది విస్తరించబడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: