కొత్తది వచ్చాక పాత దానికి అలవాటు పడిన యూజర్లని బలవంతంగా ఇబ్బంది పెట్టి కొత్త దానికి మార్చడం టెక్ కంపెనీలకు అలవాటే. అయితే గూగుల్ కాస్త చూసీ చూడనట్లు మెల్లగా జనాలకు కొత్త సర్వీసులు అలవాటు చేస్తే.. ఫేస్‌బుక్ జనాల పీక మీద కత్తి పెట్టి ఇబ్బంది పెట్టేస్తుంది.

ఎందుకు ఫేస్‌బుక్‌ని ఈ విషయంలో మళ్లీ తిట్టుకోవలసి వస్తోందంటే.. Photo Sync సదుపాయం ద్వారా తమ ఫోన్లలో ఉన్న ఫొటోల్ని ఫేస్‌బుక్‌లోకి గతంలో అప్‌లోడ్ చేసుకున్న యూజర్లకి ఫేస్‌బుక్ సడన్‌గా ఝలక్ ఇచ్చింది. జూలై 7 లోపు Moments యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోపోతే ఫొటోలన్నీ పోతాయి అని భయపెట్టేసింది. భారీ మొత్తంలో తమ ఫొటోల్ని ఇప్పటికే sync చేసుకున్న వారు ఉన్న ఫళంగా ఉలిక్కి పడ్డారు.

ఫేస్‌బుక్‌కి ఇది కొత్త కాదు. కొత్త యాప్స్‌ని వత్తిడి తెచ్చి మరీ వినియోగదారులపై రుద్దడంలో ఫేస్‌బుక్ రాటుదేలిపోయింది. రెండేళ్ల క్రితం నాటి మాట.. అప్పట్లో Facebook యాప్‌లోనే ఫ్రెండ్స్‌తో ఛాట్ చేసుకునే వీలుండేది. సడన్‌గా ఫేస్‌బుక్ Messenger అనే కొత్త యాప్‌ని తయారు చేసింది. కొన్నాళ్లు చూసింది. దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అర్థమైంది. ఇక లాభం లేదని ఇప్పటి లానే అప్పుడు కూడా ఓ డెడ్‌లైన్ పెట్టేసి.. ఆ తేదీ నుండి Facebookలో ఛాట్ ఆప్షన్ ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నించిన ప్రతీ ఒక్కరికీ Messenger ఇన్‌స్టాల్ చేసుకోమని ఓ మెసేజ్ వెక్కిరించేలా ఏర్పాటు చేసింది. దాంతో జనాలు చచ్చినట్లు Facebook Messengerని ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు.

ఇటీవలి కాలంలో Facebook Messenger చాలా శక్తివంతంగా మార్చబడిందనుకోండి. అయినప్పటికీ పాత సదుపాయాల్ని తొలగించి కొత్త యాప్స్‌ని తీసుకు వచ్చేటప్పుడు ఫేస్‌బుక్ అనుసరిస్తున్న కఠిన ధోరణి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ వాడకందారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మున్ముందు అయినా ఫేస్‌బుక్ యూజర్లకి తగినంత సమయమూ, ప్రత్యామ్నాయ మార్గాలూ ఇస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: