సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లో ఏర్పాటు కానున్న అధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాట్లను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర డిజిపి  మహేందెర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎల్ అండ్ టీ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., రోహిణీ ప్రియదర్శిని, ఐపీఎస్., షీ టీమ్స్ డీసీపీ అనసూయ, క్రైమ్స్ ఏడీసీపీ ఇందిరా, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏడీసీపీ గౌస్ మోహియుద్దీన్, ఏసీపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ త్వరలో అందుబాటులోకి రాబోతోంది.


ప్రస్తుతం హైదరాబాద్‌లో వెయ్యి, సైబరాబాద్‌లో 500 కెమెరాల్ని మాత్రమే పర్యవేక్షించే సదుపాయముంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా భారీ తెరపై ఏకకాలంలో 2,000 కెమెరాల్ని వీక్షించే సదుపాయం సాక్షాత్కరించనుంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ట్రై కమిషనరేట్ల పరిధిలో ‘సేఫ్‌ సిటీ (సురక్షిత నగరం)’ ప్రాజెక్టు కింద ఏర్పాటవుతున్న సీసీ కెమెరాల దృశ్యాల్ని ఈ కేంద్రం నుంచే పర్యవేక్షించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న జంట పోలీస్‌ టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు కమ్యూనిటీపోలీసింగ్‌, నేను సైతం ప్రాజెక్టుల కింద కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న లక్షలాది కెమెరాల్నీ ఈ కేంద్రంలో పర్యవేక్షించే వీలు కలగనుంది.


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సేఫ్‌ సిటీ (సురక్షిత నగరం) ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఈ కేంద్రం కీలకం కానుంది.
ఎల్‌ అండ్‌ టీ సంస్థ మూడు కమిషనరేట్లలో 10,000 అధునాతన కెమెరాల్ని ఏర్పాటు చేస్తోంది. దీంతో ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులు పారిపోయే మార్గాల్ని నిశితంగా పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది.  


హైలైట్స్..
- వేగంగా వెళ్లే వాహనాల నంబర్‌ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్‌ కెమెరాల్నీ అందుబాటులోకి తెస్తున్నారు.
- సామాజిక పోలీసింగ్‌లో భాగంగా కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాల్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.  
- ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ కోసం అధునాతన సాంకేతికతతో అందుబాటులోకి రాబోతోన్న ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్‌) ప్రాజెక్టులో భాగంగా మూడు కమిషనరేట్లలో కెమెరాల్ని అమర్చనున్నారు.
- ఏదేని కూడలిలో ట్రాఫిక్‌ జాం ఏర్పడితే సిబ్బంది ప్రమేయం ఏమీ లేకుండానే సమీప కూడళ్ల నుంచి అటు వైపు వాహనాల్ని రానీయకుండా నియంత్రించే అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి రానుంది.
- ‘నేను సైతం’ ప్రాజెక్టులో భాగంగా వ్యక్తిగతంగా మూడు కమిషనరేట్లలో 10 లక్షల సీసీ కెమెరాల్ని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
- ఇలా పలు ప్రాజెక్టుల కింద ఏర్పాటు చేసే లక్షలాది కెమెరాల్ని ఈ కేంద్రం నుంచే వీక్షిస్తారు. భారీ తెరపై ఒకేసారి 2,000 కెమెరాల్ని చూడవచ్చు. అవసరాన్ని బట్టి వీలైనన్ని కెమెరాల్ని జూమ్‌ చేసి దృశ్యాల్ని వీక్షించొచ్చు.
- ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 14 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 3 వరుసల్లో వరుసకు 9 చొప్పున టీవీ స్క్రీన్‌లుంటాయి. ఒక్కో టీవీ తెర సామర్థ్యం 70 అంగుళాలు. ఈ భారీ తెర పక్కనే రెండు వైపులా మరో నాలుగేసి టీవీ తెరలు 55 అంగుళాల సామర్థ్యం గలవి ఉంటాయి.
- ఈ కేంద్రంలోనే దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజులపాటు నిక్షిప్తం చేసి ఉంచేలా భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి సర్వర్ల సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది.
- ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఆధునిక హంగులతో వార్‌రూంను ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: