తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి రాబోతుంది. పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఐటిసి లిమిటెడ్ ను  కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్ధాలు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని సిఎం చెప్పారు. ఐటిసి చైర్మన్ సంజీవ్ పురి, ఇ.డి. నకుల్ ఆనంద్, సీనియర్ అధికారులు సంజయ్ సింగ్, ఉషారాణిలు ప్రగతి భవన్ లో  సిఎంతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో రూ.800 కోట్ల వ్యయంతో ఐటిసి చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా సంజీవ్ పురి వివరించారు. తెలంగాణలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తక్కువ సమయంలోనే నిర్మించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడం కోసం, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్ధాలు అందడం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగ పెట్టుకున్నది. ఈ లక్ష్య సాధనకు ఈ రంగంలో అనుభవం కలిగిన ఐటిసి కలిసి రావాలి. 


రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలున్నాయి. ముడి సరుకు సేకరణలో, ఇతరత్రా అంశాల్లో మహిళల సేవలను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి. దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.
ములుగు జిల్లాలో రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐటిసి చొరవ చూపాలని సిఎం కోరారు. దీనికి ఐటిసి అధికారులు సానుకూలంగా స్పందించారు. 


‘‘కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తున్నాము. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 500 టిఎంసిల సామర్థ్యం కలిగిన జలాశయాలు సిద్ధమవుతున్నాయి. దాని చుట్టూ అందమైన ప్రకృతి ఆకృతి దాలుస్తున్నది. రాష్ట్రంలో సహజ సిద్ధమైన అడవులున్నాయి. చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇవన్నీ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందే అవకాశం ఉంది. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. పర్యాటక ప్రాంతాల అభివృద్దిలో ఐటిసి కూడా కలిసి రావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: