చంద్రయాన్-2 భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ  చంద్రుడిపై పరిశోధన కోసం చేపట్టిన రెండవ యాత్రకు ఉపయోగిస్తున్న నౌక. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి, 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో అమర్చారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి రోవరును పంపుతున్న తొలి దేశం భారతే. ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు కాగా ఇందులో వాహక నౌకకు రూ. 375 కోట్లు అయింది. చంద్రయాన్-2లో మూడు పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటరు. ఇది చంద్రుడి కక్ష్యలో తిరుగుతూంటుంది.

మరొకటి ల్యాండరు. చంద్రయాన్-2 నిర్ధారించిన చంద్రుని కక్ష్యలోకి చేరాక, రోవరు దీనినుండి విడివడి, చంద్రుడి వైపు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై నిదానంగా దిగుతుంది. తరువాత, ఈ ల్యాండరు నుండి రోవరు అనే మూడో పరికరం బయటకు వస్తుంది. దీనికి 6 చక్రాలున్నాయి. అది చంద్రుడి మీద కదులుతూ ఉపరితలాన్ని పరిశీలిస్తూ, పరిశోధిస్తుంది. చంద్రయాన్-2 లో ఇస్రో తాను రూపొందించిన 13 శాస్త్ర పరిశోధన పరికరాలతో పాటు నాసా వారి లేజరు రెట్రోరిఫ్లెక్టరును కూడా అమర్చింది. 

ఈ నౌక సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణధ్రువం పైన ఈ  తెల్లవారుఝామున 1.30-2.30గంటల మధ్య దిగనుంది.  చంద్రుడిపై  లాండర్ విక్రమ్ దిగగానే ఈ  రోవర్ నుండి  ప్రగ్యాన్ వేరవుతింది. ఇలా బయటకొచ్చిన ప్రగ్యాన్ 14 రోజులపాటు చంద్రుడిపై అనేక పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ మిషన్ ప్రారంభమైన 48 రోజుల తరువాత ఈ లాండర్, రోవర్లు చంద్రుడిపై దిగనున్నాయి. మొదట 2019 జూలై 15 న జరపాలని తలపెట్టిన ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు. క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3 ఎమ్1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. 
 
అసలు ఈ  చంద్రయాన్ గురించి పూర్తిగా తెలియాలి అంటే మీరు ఈ 6 విషయాల గురించి తెలుసుకోవాలి...   
1. లాంచ్ వెహికల్ 
2. లాండర్ విక్రమ్ 
3. రోవర్ ప్రగ్యాన్ 
4. ఆర్బిటర్ 
5. లాండింగ్ 
6. ఎందుకు దక్షిణ ధృవంపైనే దిగడం


1. లాంచ్ వెహికల్:
జి ఎస్ ఎల్ వి మాక్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 చంద్రుడిపైకి బయల్దేరింది. భారత దేశ బాహుబలిగా పేర్కొనే ఈ రాకెట్ లో టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డవి. 

2.లాండర్  విక్రమ్:
దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్ అని పేరు పెట్టారు.  దాదాపు 1500 కిలోల బరువుండే ఈ లాండర్ లోనే రోవర్ ప్రగ్యాన్ ఇమిడి ఉంటుంది. ఈ లాండర్ చంద్రుడిపై 14 రోజులపాటు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆర్బిటర్, రోవర్లతో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తోంది ఈ లాండర్ విక్రమ్. ఈ లాండర్ నేరుగా చంద్రుడిపై క్రాష్ లాండింగ్ చేస్తూ దిగకుండా సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది.విక్రమ్‌లో 800 న్యూటన్ సామర్థ్యం గల 5 ప్రధాన ఇంజన్లు, 50 న్యూటన్ల సామర్థ్యం గల 8 యాటిట్యూడ్‌ను నియంత్రించే 8 ఇంజన్లు ఉన్నాయి.  

3. రోవర్ ప్రగ్యాన్ : 
దాదాపు 27కిలోల బరువుండే ఈ రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై తిరుగాడుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. దీన్ని ఇస్రో రూపొందించింది.  6 చక్రాలతో తిరుగాడే ఈ రోవర్ కేవలం సౌర శక్తిపైనా మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. 500 మీటర్ల పాటు ఈ రోవర్ చంద్రుడి ఉపరితలం పైన తిరగాడుతుంది. రోవర్ సేకరించిన సమాచారాన్ని విక్రమ్ కి అందజేస్తే, విక్రమ్ దాన్ని భూమికి తిరిగి పంపిస్తుంది. ప్రజ్ఞాన్ ఒక చంద్ర పగలు కాలం అంటే భూమిపై 14 రోజులు పాటు పని చేస్తుంది. చంద్రుని రాత్రి సమయంలో ఉండే గడ్దకట్టించే శీతల  స్థితిని అందులోని ఎలక్ట్రానిక్స్ తట్టుకోలేవు. అయితే, దానిలో ఆటోమాటిగ్గా నిద్రించే 
వ్యవస్థ అలాగే  మేలుకునే పవర్ వ్యవస్థ ఉంది. చంద్ర రాత్రి వేళ పవర్ వ్యవస్థ నిద్రిస్తుంది. రాత్రి ముగిసి, పగలు మొదలు కాగానే మళ్ళీ  పవర్ వ్యవస్థ మేలుకుంటుంది. అంటే  ప్రజ్ఞాన్ ఒకసారి ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి 14 రోజులు పడుతుంది. 

4. ఆర్బిటర్: 
 ఈ ఆర్బిటర్  చంద్రుడిపై 100x100 కిలోమీటర్ల కక్ష్యలో ఏడాది  పాటు పరిభ్రమిస్తుంది. ఈ సమయంలో చంద్రుడిని ప్రతి క్షణం ఒక కంట కనిపెడుతూ ఫోటోలు తీస్తూ, భూమి మీదికి సమాచారాన్నిపంపిస్తుంటుంది.

5. లాండింగ్ : 
ఇస్రో నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండుతూ.. ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ చంద్రయాన్-2 వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ సమయంలో దాని వేగం గంటకు 6,120 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. సరిగ్గా చంద్రుడిపై విక్రమ్ కాలు మోపే వేళలలో అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో వ్యోమనౌకకు అమర్చబడిన సోలార్ ప్లేట్ల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. రెండు చంద్రబిలాల మధ్య ఎగుడు దిగుళ్లు లేని సమతలంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ద్వారా శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు.
ఒకవేళ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దిక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. ఈ 15 నిమిషాల ప్రక్రియ చంద్రయాన్-2కే ఆయువుపట్టు. అందుకే దీనిని ఇస్రో ఛైర్మన్ 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్‌గా అభివర్ణించారు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లే, చంద్రునికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం చంద్రుని 35*100 మీటర్ల కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్.. మామూలుగా చంద్రుడి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా జరక్కుండా ఉండేందుకు గాను .. శాస్త్రవేత్తలు విక్రమ్‌లోని డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా దిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా వ్యోమనౌకను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. 

6. దక్షిణ ధృవంపైన్నే లాండింగ్ ఎందుకు ...
దక్షిణ ధృవంపై దిగడానికి ప్రముఖంగా రెండు కారణాలున్నాయి. మొదటిది సౌరశక్తి అధికంగా లభించడం. ఇలా సౌరశక్తి ఈ ప్రాంతంలో అధికంగా ఉండడం వల్ల ఈ పరికరాలు పనిచేయడానికి వేరే ఇంధనాన్నో లేదా బ్యాటరీలనో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు. మరో విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టలు రాళ్లు తక్కువగా ఉండడం వల్ల సాఫ్ట్ లాండింగ్ కి అనువైన ప్రదేశం తేలికగా లభ్యమవుతుంది. రెండో కారణమేంటంటే సాంకేతికంగా ఈ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో నీటి ఆనవాళ్లు, ఖనిజాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా గనుక చూసుకుంటే,చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్  చరిత్ర సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: