చివరి నిమిషంలో సమస్యలు తలెత్తినా.. చంద్రయాన్ 2 ద్వారా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందిన ఇస్రో...మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడు, అంగారకుడే కాదు.. ఈసారి ఏకంగా సూర్యుడిని టార్గెట్‌గా పెట్టుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. వచ్చే ఏడాది సన్ మిషన్‌ను చేపట్టబోతోంది ఇస్రో.  సూర్యుడి వాతావరణానికి సంబంధించి అంతుపట్టని ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఆదిత్య పేరుతో ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది.  


చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కాస్త నిరుత్సాహపరిచినా.. అంతరిక్ష పరిశోధనల్లో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలు తాము పెట్టుకున్న లక్ష్యాల నుంచి వెనకడుగు వేయడం లేదు. ఓ వైపు చంద్రయాన్  సాంకేతిక సమస్యలు , చిన్న చిన్న వైఫల్యాలపై రివ్యూ చేసుకుంటూనే...మరోవైపు భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది మరో మెగా మిషన్‌ను ప్రారంభించబోతోంది ఇస్రో.  దాని పేరే సన్ మిషన్ ఆదిత్య ఎల్ 1.  సూర్యూడి వాతావరణంపై పరిశోధనలు చేసేందుకు 
ఇస్రో చేపట్టిన తొలి  ప్రయోగం ఇదే.  


సూర్యుడి వాతావరణంపై ఆదిత్య 1 పేరుతో ప్రాజెక్టు చేపట్టాలని ముందుగా ఇస్రో భావించింది. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌'తో కూడిన 400 కేజీల పేలోడ్‌ను ఉపగ్రహం ద్వారా పంపేందుకు కసరత్తు చేశారు. అయితే.. సూర్యుడు-భూమికి మధ్యలో 'లాగ్రాంగియన్‌ పాయింట్‌-1 చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఉప గ్రహాన్ని ప్రవేశపెడితే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని గుర్తించారు. దీంతో ప్రాజెక్టును ఆదిత్య ఎల్ 1 పేరుతో రీడిజైన్ చేశారు.  


ఆదిత్య-1 ద్వారా పంపాలని భావించిన పేలోడ్‌ సూర్యుడి వాతావరణం-కరోనాపై పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆదిత్య-ఎల్‌1 ద్వారా పంపనున్న పేలోడ్‌లు కరోనాతో పాటు సూర్యుడి ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌లను కూడా పరిశీలిస్తాయి.  భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న హాలో ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని పంపించి పరిశోధనలు నిర్వహిస్తారు.. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహంలో మొత్తం ఏడురకాల పరిశోధనా పరికరాలు ఉంటాయి.  


సూర్యుడి వాతావరణం గురించి మానవాళి మెదళ్లను తొలిచేస్తున్న అనేక అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు వెతికే దిశగా భారత్‌ సన్నద్ధమవుతోంది. భానుడిపై పరిశోధనలకుగాను తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు ప్రారంభించింది. 'ఆదిత్య-ఎల్‌ 1' పేరుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. 2019-20 మధ్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు కసరత్తుచేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: