ఇస్రో.. ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 విషయంలో చివరి ఆశలు మిణుకు మిణుకు మంటున్నాయి. ల్యాండర్ విక్రం ఇప్పటి వరకూ సిగ్నల్స్ కు బదులివ్వకపోవడంతో ఇస్రో దాదాపుగా ఆశలు వదిలేసుకుంది. కానీ విక్రం స్పందించడానికి ఇంకా గడువు మాత్రం కొన్ని గంటలే ఉంది. గతనెల7న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైంది. దాంతో ల్యాండర్ విక్రం నుంచి సంకేతాలు నిలిచిపోయాయి.


ఈ సంకేతాలను పునరుద్ధరించేందుకు ఈ నెల 21తో గడువు ముగిసిపోతోంది. ల్యాండర్, రోవర్ మిషన్ల జీవితకాలం చంద్రునిపై ఒక రోజు. అంటే భూమిపై 14 రోజులన్నమాట. అంటే.. 21లోపు ల్యాండర్ విక్రం మన సంకేతాలకు స్పందిచకపోతే..ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే.


మరోవైపు.. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విఫలమైన ల్యాండర్ విక్రం ఫొటోలను నాసా తీసిందట. తమ లునార్ రికానసెన్స్ ఆర్బిటర్ వ్యోమ నౌక ఈ ఫోటోలను తీసినట్లు నాసా చెప్పింది. తమ ఆర్బిటర్ కొన్ని ఫొటోలను పంపినట్లు తెలిపింది. వాటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పింది.


తమ వద్ద ఉన్న పాత ఫోటోలతో కొత్త ఫొటోలను పోల్చి చూస్తే విక్రం లాండర్ అందులో కనిపించే అవకాశం ఉంది. అయితే ఫొటోలు తీసేటప్పుడు ల్యాండర్ నీడలో ఉంటే మాత్రం విక్రం ఉన్నా కనిపించదు. లూనార్ ఆర్బిటర్ చంద్రునికి అత్యంత సమీపం నుంచి ఫొటోలు తీసిందట. అందువల్ల ఎక్కువ ప్రదేశం నీడలో ఉందట.


మరింత సమాచారం తెలుసుకోండి: