చంద్రయాన్ 2 లో విక్రమ్ కథ ముగిసింది. ల్యాండర్ స్పందిస్తుందని 14 రోజుల పాటు ఇస్రో తీవ్రంగా ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. చంద్రుడిపై దిగే సమయంలో క్రాష్ ల్యాండింగ్ జరగడంతో.. విక్రమ్ లో కొన్ని భాగాలు పనిచేయడం మానేశాయి. లోపాలు సరిదిద్దుకుంటామనీ భవిష్యత్తులో  సేఫ్ ల్యాండింగ్ చేస్తామని ఇస్రో ప్రకటించింది. 


 చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ల కథ ముగిసింది. చంద్రుడిపై రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయ్యాయి. చంద్రగ్రహంపై రాత్రివేళ మైనస్‌ 180 డిగ్రీల సెల్సియస్‌ వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో పనిచేసే విధంగా విక్రమ్‌ రూపొందలేదు. చంద్రుడిపై రాత్రి అంటే.. భూమిపై 14 రోజులకు సమానం. అక్కడ పగలు కూడా పద్నాలుగు రోజులుంటుంది. చంద్రుడిపై రాత్రి  ప్రారంభం కావడంతోనే విక్రమ్‌ ల్యాండర్‌ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చంద్రుడిపై విక్రమ్‌ క్రాష్ ల్యాండ్ అయింది. సోలార్‌ ప్యానెళ్లు అనుకున్నరీతిలో సెట్‌కాకపోతే.. చార్జింగ్‌ అయిపోయి.. విక్రమ్ మూగబోయే అవకాశం ఉంది. 


ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్‌ ల్యాండర్‌ ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం ముగిసిపోయింది. 


చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్‌ ల్యాండర్‌.. అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ మళ్లీ విక్రమ్‌ ల్యాండర్‌ కోసం వెతకనుంది. కానీ అప్పటికీ విక్రమ్‌ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: