ప్ర‌స్తుతం టెక్నాలజీ రోజు రోజుకు అమిత వేగంతో పెరిగిపోతోంది. ఆపద సమయాల్లో మనుషుల కంటే ముందే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుతోంది. ఈ క్ర‌మంలోనే దిగ్గజ టెక్నాలజం ఆపిల్ నుంచి వచ్చిన వాచ్ ఓ మనిషి ప్రాణాలను కాపాడింది. నమ్మలేకపోయినా ఇది నిజం. అలాగే అమెరికాలో జరిగిన ఓ సంఘటన నెటిజ‌న్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక వివ‌రాల్లోకి వెళ్తే.. వాషింగ్టన్‌కు చెందిన గేబ్ బర్డెట్ అనే యువకుడు సెప్టెంబర్ 20న తన తండ్రి బాబ్‌‌తో కలిసి కొండలపై సైకిల్ తొక్కడానికి రివర్‌సైడ్ స్టేట్ పార్క్‌‌కు వెళ్ళాడు.


ఇద్దరూ వేరు వేరు మార్గాల్లో వెళ్లి ఓ ప్రాంతంలో కలుసుకుందాం అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే  చెరో మార్గం గుండా పర్వతాన్ని అధిరోహిస్తుండగా.. తన తండ్రి ప్రమాదంలో ఉన్నట్టు అతని చేతికున్న ఆపిల్‌ వాచ్‌ నుంచి బర్డెట్‌ వాచ్‌కు అలర్ట్‌ వచ్చింది. అంతేగాక అతని తండ్రి ఉన్న ప్రదేశాన్ని సైతం వాచ్‌ షేర్‌ చేసింది. దాంతో బర్డెట్ ఆ ప్రాంతానికి చేరుకోగా.. అక్కడ  తన తండ్రి కనిపించలేదు. కానీ, తండ్రి వాచ్‌ నుంచి మరోసారి సందేశం వచ్చింది.


ఆయన సేక్రేడ్ హార్ట్ మెడికల్ సెంటర్‌లో ఉన్నట్టు వాచ్‌ అలర్ట్‌ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే అతడు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్క‌డ త‌న తండ్రి క్షేమంగానే ఉన్నాడని చెప్పడంతో గేబ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విష‌యాల‌ను  బర్డెట్ ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. పర్వతారోహణ చేస్తుండగా ప్రమాదవశాత్తూ నాన్న కింద‌కు పడిపోయాడు. దాంతో ఆయన చేతికున్న ఆపిల్‌ వాచ్‌లో గల ‘‘హార్డ్‌ ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌’’ అత్యవసర నెంబర్‌ 911కు కాల్‌ కనెక్ట్‌ చేసింది.


సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌లో అక్కడికి చేరుకుని హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించి నాన్నకు ప్రాథమిక చికిత్సనందించారు. అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఆపిల్‌ వాచ్‌లో ఈ ఫీచర్‌ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మ‌రికొంద‌రు ఆపిల్ వాచ్‌ని మెచ్చుకొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: