మనకు అర్జెంట్‌గా బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేయాల్సి రావడమో, లేక  పెద్ద మొత్తంలో చెక్‌లు డ్రా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆఫీసులో బాసు పర్మిషన్ ఇవ్వడు..పోనీలే సాయంత్రం 5 గంటలకు ఆఫీసు అయిపోయాక బ్యాంకుకు వెళదామంటే 5 గంటలకు 10 నిమిషాలకు ముందే బ్యాంకులు డోర్లు బంద్ చేస్తాయి. ఇక నుంచి ఈ ఇబ్బందులు ఉండవు. తాజాగా రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల పనివేళలను మార్చింది.  ప్రస్తుతం  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బ్యాంకులలో లావాదేవీలు జరుగుతున్నాయి. వ్యాపార వర్గాలకు ఈ టైమింగ్స్ చాలా ఇబ్బందికరంగా మారాయి.  అయితే ఇక నుంచి ఆ పనివేళలను 10 నుంచి 6 గంటల వరకు నిర్వహించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచన ప్రాయంగా తెలిపింది. దీంతో వ్యాపార వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు వెసులుబాటు కల్పించినట్లేనని తెలుస్తోంది. అలాగే రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) ద్వారా ఎంతైనా చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. కమీషన్లు కూడా తగ్గిస్తున్నట్లు చెప్పడంతో వ్యాపారవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


ఈనెల 1వతేదీ నుంచి పనివేళలు, కమీషన్ల మార్పు అందుబాటులోకి తీసుకురావాలని యోచించినప్పటికీ వాయిదా పడినట్లు ఆర్బీఐ తెలిపింది.  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సమాచారం ఇచ్చి, మార్పులు చేసేందుకు కొంత గడువు ఇచ్చినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఆర్‌బీఐ నిర్ణయం ఇటు ప్రజలు, అటు వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.  అయితే సాయంత్రం 4 గంటల తరువాత బ్యాంకుకు వెళ్లాలంటేనే ప్రజలు పని జరగదులే ఎందుకు పోవాలని భావించారు. అయితే ఇప్పుడా సమస్య ఉండబోదు. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని బ్యాంకులు అందుబాటులో ఉంటాయి.  అయితే ఆర్‌బీఐ ఆదేశానుసారం వారంలో ఐదు రోజులే బ్యాంకులు పనిచేస్తాయా లేక ఆరు రోజులు పనిచేస్తాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రతి నెలా రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారంతో పాటు బ్యాంకులు పనిచేయడం లేదు. ఆర్‌బీఐ సూచనల ప్రకారం ఆ రెండు రోజులు అంటే ప్రతి నెల ఒకటో శనివారం, మూడో శనివారం కూడా బ్యాంకులు మూతపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రజలకు మేలు జరిగేలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకుల పనివేళల మార్పు ఉపయోగకరమేనని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి ప్రజల ఇబ్బందులు గమనించిన ఆర్బీఐ బ్యాంకు పనివేళలను మార్చడం నిజంగా అభినందనీయం. అయితే బ్యాంకు పనివేళలను రెండు గంటలను అదనంగా పెంచడంపై బ్యాంకు సిబ్బంది ఎలా స్పందిస్తారో చూడాలి. వర్కింగ్ టైమింగ్స్ రెండు గంటలు అదనంగా పెంచితే..సెకండ్ సాటర్‌డే, ఫోర్త్ సాటర్‌కు బదులుగా వారానికి 5 రోజులు పని దినాలు ప్రకటించాలని బ్యాంకుల సిబ్బంది డిమాండ్ చేసే అవకాశం  ఉంది. ఏదైమైనా బ్యాంకు టైమింగ్స్ సాయంత్రం 6 గంటల వరకు పెంచడం ప్రజలకు మేలు కలిగించే విషయమే..


మరింత సమాచారం తెలుసుకోండి: