వరుసగా పతనమవుతున్న రూపాయికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బూస్ట్ ఇచ్చింది. కొంతకాలంగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ భారీగా పడిపోతోన్న విషయం తెలిసిందే. ఇక ఆగష్టు 26  ఉదయం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 72.02 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో రూ.72.25కు చేరింది. శుక్రవారం నాటి 71.66 ముగింపుతో పోలిస్తే ఇది 59 పైసలు తక్కువ. 2019లో ఇంత స్థాయిలో రూపాయి ఎప్పుడు పడిపోలేదు.


అయితే ఈ రూపాయి పతనానికి ఆర్బీఐ బ్రేక్ వేసింది. రికార్డు స్థాయిలో రూ .1.76 లక్షల కోట్ల డివిడెండ్, మిగులు నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం రూపాయికి ఊతమిచ్చింది. దీంతో సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే మంగళవారం ఏకంగా 54 పైసలు జంప్‌ చేసింది.  గత అయిదు నెలల కాలంలో ఇదే అతిపెద్ద లాభంగా నిలిచింది. వారం గరిష్ట స్థాయి 71.48 వద్ద ముగిసింది. సోమవారం 36 పైసలు తగ్గి  72.02 వద్ద  తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి  చేరింది.


ఇక విదేశీ మారక మార్కెట్లో రూపాయి డాలర్‌కు 71.70 వద్ద అధికంగా ప్రారంభమైంది. ఇదే రోజు గరిష్ట స్థాయి 71.45 ను తాకింది.  చివరకు 54 పైసలు పెరిగి 71.48 వద్ద స్థిరపడింది.   మరోవైపు ప్రధాన కరెన్సీలతో డాలరు బలహీనం రూపాయికి మద్దతిచ్చింది. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయనే అంచనాలతో యుఎస్ డాలర్ ఇండెక్స్  0.18 శాతం పడిపోయి 97.90 వద్దకు చేరుకుంది. అటు 11 ఏళ్ల త‌ర్వాత చైనా క‌రెన్సీ యువాన్  డాల‌ర్ మార‌కంతో పోలిస్తే క‌నిష్టానికి ప‌డిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: