ఆయన ఓ తెలుగు తేజం.. రాజకీయాల్లో చాణక్యుడిగా పేరు సంపాదించారు. కర్మయోగిగా ప్రసిద్ధి చెందారు. రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకూ చాలా పదవులు అలంకరించేశాం.. ఇక విశ్రాంతి తీసుకుందామనుకునే వేళ.. ఆయన జీవితం మలుపు తిరిగింది. అనూహ్యంగా దేశానికే ప్రధానమంత్రి అయ్యారు. ఏమాత్రం అనుకూలంగా పరిస్థితులులేని పరిస్థితి నుంచి ఒక్కో సమస్యనూ పరిష్కరిస్తూ అటు పార్టీని, ఇటు దేశాన్ని గట్టెక్కించారు.

 

 

ఆయనే తెలుగు తేజం పీవీ నరసింహారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా వంగరలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. హస్తినలో ప్రధాని పీఠం అలంకరించేవరకూ అత్యున్నతంగా సాగింది. ఆయన చేపట్టిన పదవుల కంటే ఆయన వ్యక్తిత్వం రాజకీయాల్లో చాలా ప్రత్యేకమైంది. స్వయంగా వందల ఎకరాల భూములున్న భూస్వామ్య కుటుంబంలో పుట్టినా ఆయన ఏనాడూ ఐశ్వర్యం ప్రదర్శించలేదు. ఏనాడూ ఆస్తుల వెంట, సంపద వెంట పాకులాడలేదు.

 

 

రాజీవ్ గాంధీ హత్య అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా.. సొంతగ్రూపులు లేని వ్యక్తిగా ఆయన సోనియా ఎంపిక అయ్యారు. అనుకోకుండా ప్రధాని అయ్యారు. దేశం దిక్కులేని నావగా ఉన్న సమయంలో చుక్కానిగా మారి దేశాన్ని నడిపించారు. ఆర్థిక సంస్కరణల బాట పట్టించి సంపద సృష్టించారు. ఆధునిక భారతాన్ని రచించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాణక్యంతో ఐదేళ్ల పాటు స్థిరంగా ఉంచగలిగారు.

 

 

పీవీ నరసింహారావు వ్యవస్థలను నిర్మించారు. భవిష్యత్ ను దూరదృష్టితో అంచనావేసి దేశాన్ని ప్రగతిపథంవైపు నడిపించారు. మన్మోహన్ సింగ్ వంటి మేధావిని ఆర్థిక నిపుణుడిని ఎలాంటి రాజకీయ నేపథ్యంలేకపోయినా ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిని చేసేశారు. ఎన్ని సాధించినా.. ఎన్ని శిఖరాలు అధిరోహించినా ఆయన వినమ్రుడిగానే ఉన్నారు. దేశ చరిత్రలో ఓ గొప్ప ప్రధానిగా మిగిలారు.. అందుకే పీవీ.. తెలుగు ఠీవి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: