ఈ భూ ప్రపంచంలో మనిషి అన్ని జీవరాశులకన్నా చాలా తెలివైన వాడు.. మంచి చెడు విచక్షణా జ్ఞానం కలిగిన ఏకైక జీవి. నిరంతరం ఏదో కనుగొనాలన్న తపనతో అవలీలగా అంతరిక్షానికి ఎగిరిపోయాడు. అధఃపాతాళం అంతు చూశాడు.. అలాంటి మనిషి ఒక్కొక్కసారి తనే అన్నీ మర్చి అశాశ్వతమైన భౌతిక సుఖాలకోసం అనవసరంగా ఆవేశానికి లోనై, మానవత్వం మరచి మనిషిగా మాయమై మృగంగా మారుతున్నాడు.. పూర్వకాలంలో ఉన్న మానవజాతి చరిత్ర గొప్పతనాన్ని మరచి నేడు జీవిస్తున్న మనం ఆ చరిత్రలను తరచి చూస్తే.. ఎన్నో ఉదంతాలు అవగతమవుతాయి.

 

 

ఇకపోతే భగవంతుని అనుగ్రహంతో ఎందరో మహాభక్తులు భక్తి పారవశ్యంతో ప్రజల గుండెల్లో ఆదర్శంగా నిలిపోయారు.. అందులో కబీరు దాసు ఒకరు.. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాల వలె వెలుగొందిన వారిలో కబీరుదాసు అగ్రగణ్యుడు. ఈయన జన్మస్దలం కాశీ అని చెబుతారు.. క్రీ.శ.1399 లో జన్మించిన కబీరుకు ఆయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ చేనేత పని చేసుకునే ఒక నిరుపేద ముస్లిం దంపతులైన నీమా, నీరూ అనేవారు పెంచి పెద్దచేశారు. కాగా చిన్నతనంలో ఎంతో దుర్భరమైన దారిద్రం అనుభవించాడు..

 

 

యవ్వనంలోకి అడుగుపెట్టగానే, పెళ్లిచేసుకోగా ఆ భార్య కొద్దికాలానికే కాలం చేసిందట.. ఆ తర్వాత రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమే పరమగయ్యాళి కావటం వలన జీవితం పై విసిగిపోయి, విరక్తి భావాన్ని పెంచుకుని ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు చేయడమే కాదు.. పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. ఆ సమయంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు, అంతే కాదు విరివిగా మూఢాచారాలు వ్యాపించి ఉండేవి.. అలాంటి టైంలో జ్ఞానసంపన్నుడైన కబీర్ ఎన్నో ఉపదేశాలను ప్రజలకు వినిపించే వాడట.. అయితే ఇన్ని చెబుతున్న కబీరుదాసు చదువుకొన్న విద్యాధికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్".

 

 

ఇకపోతే కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్న కబీర్ క్రీ.శ.1518లో మరణించాడు. ఆ సమయంలో కబీర్ ముస్లిం అని, కాదు, హిందువని తమ ఆచారాల ప్రకారమే అతన్ని దహనసంస్కారాలు చేయాలని అతని భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు వాదులాడుకున్నారు. ఇలాంటి సమయంలో కబీర్ భౌతికకాయం మాయమై, దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయట. ఈ నిదర్శనం వల్ల, వారికి భక్త కబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమయింది. ఇలా కబీరు 120 యేళ్ళ సుదీర్ఘ జీవితాన్ని చూసి మహా భక్తుడిగా ఈ లోకాన్ని వీడి వెళ్ళారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: