టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి వంశం అనే ట్యాగ్ ఉన్నా మొదట్లో సాధారణ యువకునిగానే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. స్టార్ హీరో స్టేటస్ అందుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయంగా మలుచుకుంటూ సినిమాసినిమాకు ఎన్టీఆర్ తన రేంజ్ ను పెంచుకున్నారు. 
 
జూనియర్ ఎన్టీఆర్ విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌తో బ్రహ్మర్షి విశ్వామిత్ర, గుణశేఖర్ రూపొందించిన రామాయణంతో నట జీవితాన్ని ప్రారంభించారు. రామోజీరావు నిర్మాతగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా హీరోగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ తొలి సినిమాతోనే పరాజయం చవిచూశారు. అనంతరం స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్లు 19 ఏళ్లకే ఎన్టీఆర్ స్టార్ హీరో స్టేటస్ అందుకునేలా చేశాయి. 
 
సింహాద్రి సినిమా తరువాత సుబ్బు, అల్లరిరాముడు, ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ లాంటి వరుస ఫ్లాపులతో ఎన్టీఆర్ కెరీర్ లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. యమదొంగ, అదుర్స్, బృందావనం సినిమాలతో సక్సెస్ బాట పట్టిన ఎన్టీఆర్ కు శక్తి, దమ్ము, రామయ్యా వస్తావయ్యా, రభస రూపంలో వరుస ఫ్లాపులు పలకరించాయి. అనంతరం అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తున్నారో గ్రహించిన ఎన్టీఆర్ నవ్యత కలిన కథాంశాలను ఎంచుకుని వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. 
 
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత చిత్రాల విజయాలతో ఎన్టీఆర్ సినిమాసినిమాకు కలెక్షన్ల పరంగా తన రేంజ్ ను పెంచుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ టార్చ్ బేరర్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమాలో నటించబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిద్దాం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: