టాలీవుడ్ స్టార్ హీరోలలో తనదైన నటన, డాన్స్, ఫైట్లతో అల్లు అర్జున్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారు. కేరళలో అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు నటవారసుడైన అల్లు అర్జున్ 1983వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన అల్లు అరవింద్, నిర్మల దంపతులకు చెన్నైలో జన్మించారు. 
 
చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదివిన అల్లు అర్జున్ బాల్యంలోనే విజేత సినిమాలో చిన్న పిల్లవాడి పాత్రలో నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమా ద్వారా అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. గంగోత్రి సినిమా విడుదలైన సమయంలో అల్లు అర్జున్ లుక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ ఆర్య సినిమాలో బన్నీని చూసి విమర్శించిన వాళ్లే ప్రశంసించారు. 
 
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా టాలెంట్ లేకపోతే విజయాలు సాధించడం సాధ్యం కాదు. అల్లు అర్జున్ బ్యాక్ గ్రౌండ్ ను ఎంట్రీ వరకే వాడుకుని సినిమాసినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. చేసే ప్రతి చిత్రం ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరించుకుంటూ ఈ సంవత్సరం అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 
 
2011 మార్చి 6న హైదరాబాద్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు వివాహం అయింది. వీరికి అయాన్, అర్హా అనే పిల్లలు ఉన్నారు. అల్లు అర్జున్‌ నటించిన ప్రతి సినిమా మలయాళంలో విడుదలై అక్కడ సక్సెస్ సాధించడం గమనార్హం. అల్లు అర్జున్ ఐ యాం దట్ ఛేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ ను నిర్మించి అందులో నటించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బన్నీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో 50 లక్షల రూపాయల విరాళం, కేరళకు 25 లక్షల రూపాయల విరాళం, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగి తోటి హీరోలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ బన్నీ విజేతగా నిలిచారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: