మన భాగ్యనగరం బాధల నగరంగా ఎప్పుడో మారిందనే విషయం తెలిసిందే.. ఇక్కడ మాటలతో కోటలు కట్టేవారుంటారే గాని, ప్రజల బాధలను నిజంగా అర్ధం చేసుకుని పంచుకునే వారు చాలా అరుదు.. ఈ మహానగరంలో బ్రతకాలంటే ప్రాణాల మీద ఆశ ఉండ కూడదు.. ఎందుకంటే ఇక్కడ ఉంటున్న ప్రతి మనిషిలో దాదాపుగా నిర్లక్ష్యం ఉంటుంది.. రాజకీయ నాయకులకే ఇంత నిర్లక్ష్యం ఉండగా, సామాన్య ప్రజలు నాకేందిలే అని అనుకుంటారు.. ఇకపోతే ఈ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మనం చూడబోయే, చదవబోయే సంఘటన..

 

 

అదేమంటే నిన్న నగరంలో కురిసిన వర్షానికి ఒక వైపు కరోనా భయం ఉండగా, మరో వైపు తృటిలో ఓ కుటుంబ ప్రాణాపాయం నుండి తప్పించుకుంది.. అందులో ఒక పసిపాప ఉండగా, ఆ పాప నానమ్మ కూడా ఉంది.. ది గ్రేట్ హైదరాబాద్‌లో ఒక భాగమైన ఉప్పల్ పరిధిలోని పీర్జాదిగూడ, బుద్ధానగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పలువురి నుండి విమర్శలు ఎదుర్కొంటుంది.. ఇక ఈ ప్రమాదం వెనుక అధికారుల, స్థానికుల నిర్లక్ష్యం ఉందనే అపవాదును మూట గట్టుకుంటుంది..

 

 

నిన్న సాయంత్రం నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన చిరు జల్లులతో రోడ్లన్నీ చిత్తడిగా మారగా, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఈ క్రమంలో పీర్జాదిగూడ బుద్ధానగర్ 40 ఫీట్ల రోడ్డులో కూడా ఇలాగే నీళ్లు నిలిచాయి. అయితే.. లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రి సమీపంలోని ఓ మెడికల్ షాపు వద్ద మరమ్మత్తు పనుల నిమిత్తం రోడ్డు పక్కన ఓ గుంత తీశారు. కాగా వర్షం నీటితో ఆ గుంత నిండిపోయి అక్కడ గుంత ఉన్నదని కనిపించకుండా మారింది.. అయితే ఆ సమయంలోనే  ఆ చిన్నారి తల్లి, నానమ్మ జ్వరంతో బాధ పడుతున్న రెండు నెలల శిశువును తీసుకొని అటుగా వచ్చారు. ముందు గుంత ఉందన్న విషయాన్ని గ్రహించని ఆ నానమ్మ అటువైపు వెళ్లుతూ పసిపాపతో సహా నేరుగా గుంతలోకి జారుకుంది..

 

 

అక్కడ జరుగబోతున్న ప్రమాదాన్ని గ్రహించిన స్థానిక మెడికల్ షాపు యజమాని, మరో యువకుడు హుటాహుటిన అక్కడికి పరుగెత్తుకొచ్చి ఆ శిశువును, మహిళను రక్షించారు. తన చిన్నారి పాపతో పాటు అత్తగారు నీటిలో మునిగిపోతుంటే ఆ శిశువు తల్లికి ప్రాణం పోయినంత పనైంది. ఇకపోతే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.. ఎలాగోలా ఈ దృష్యాలు సోషల్ మీడియాలోకి ఎక్కగా ప్రస్తుతం వైరల్‌గా మారి, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: