ఒరేయ్ బాబు కరోనా వస్తుందిరా.. ఇంటిలోనే ఉండండిరా అంటే వినని మొండివాళ్లు చాలా మందినే ఉన్నారు.. ఇక బాగా హుషారుగున్న పోరగాల్లు గుంపులు గుంపులుగా చేరి సొల్లు మీటింగ్‌లు పెట్టడం.. పేకాట.. క్యారం బోర్డ్.. ఇలా ఆటలు ఆడుతూ పొద్దు గడపడం.. ఇలాంటి పనులు చేసేటట్లైతే మరి ప్రభుత్వం లాక్‌డౌన్ ఎందుకు పెట్టినట్లు.. ఎవరింట్లో వారు ఉండమని చెవులు పగిలేలా హెచ్చరించడం దేనికి.. ఈ విషయాన్ని అర్ధం చేసుకోరు.. మాలో ఎవరికి కరోనా లేదు కదా.. మాకెందుకు వస్తుంది.. అని ఓవర్ కాన్ఫిడెన్స్‌ను ప్రదర్శించడం ఈ అతి విశ్వాసమే కొంపముంచే వరకు తెలియదు..

 

 

ఇదంతా పక్కనపెడితే.. కరోనా రోగులకు వైద్యం చేసే వైద్య సిబ్బంది కష్టాలు మామూలుగా లేవు.. వీరితోపాటుగా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. వీరంత రాత్రనక పగలనక శ్రమించేది వారి కుటుంబం కోసం కాదు.. ప్రజల కోసం.. ఈ విషయాన్ని అర్ధం చేసుకోని వారు వీళ్లకు లేనిపోని సమస్యగా మారుతున్నారు.. ఇకపోతే ప్రజలు గుంపులుగా ఉండకుండా మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పాటించమంటే వినకుండా.. చిన్న చిన్న గల్లీల్లో, ఊరు అవతల ఉన్న చెట్లపొదల్లో ఆటలాడుతున్నారు.. ఇలాంటి వారికి చెక్ పెట్టాలంటే పోలీసులు డ్రోన్ల సాయం తీసుకోక తప్పడం లేదు.. ఈ డ్రోన్ కెమెరాల సహాయంతో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి ఎలా చుక్కలు చూపిస్తున్నారో చెప్పడానికి అక్కడ జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియోను తమిళనాడులోని తిరుపూర్ పోలీసులు రిలీజ్ చేశారు.

 

 

అదేమంటే చెట్టు కింద కొందరు యువకులు క్యారెమ్ బోర్డ్ ఆడుతుండగా.. డ్రోన్ కెమెరాను పోలీసులు అక్కడికి పంపారు. దాన్ని గమనించిన ఆ యవకులు తలో దిక్కు పారిపోతుండగా, ఒక యువకుడు మాత్రం  చేతిలో క్యారమ్ బోర్డును పట్టుకుని, దాన్ని తలమీద అడ్డుపెట్టుకొని కెమెరా కంట పడకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు ఆ డ్రోన్‌ను అతడి ముందు వైపునకు తీసుకెళ్లగా, అతడు బోర్డు చాటున తన ముఖాన్ని కనబడకుండా దాచాడు..

 

 

ఇలా ఆ డ్రోన్ కెమెరాతో అతని ముఖాన్ని కవర్ చేయాలనుకున్న పోలీసులతో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడాడు ఆ యువకుడు.. అయినా గానీ అతడు ఎన్ని వేషాలు వేసిన ఆ డ్రోన్ అతణ్ని వెంబడించడం ఆపకపోవడంతో.. క్యారమ్ బోర్డును అక్కడ పడేసి పరిగెత్తాడు. ఇకపోతే ఈ వీడియో చూడటానికి భలే ఫన్నీగా ఉన్న లాక్‌డౌన్ పట్టించుకోని వారి పట్ల పోలీసులు ఎంత సీరియస్‌గా వ్యవహరిస్తున్నారనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: