అమ్మ తనానికే మచ్చ తెచ్చిన అమ్మ, అని పిలవబడే ఓ నీచురాలి అమానుష గాధ ఇది. ఆండిపట్టి సమీపంలో ఈ గురువారం జిల్లేడి పాలు ఇచ్చి స్వయానా తన కడుపున పుట్టిన ఆడ బిడ్డని హత్య చేసిన తల్లి, అమ్మమ్మ... పైశాచిక ఉదంతం ఇది. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని మెట్టనూత్తు పంచాయతీ రామనాథపురానికి చెందిన సురేష్‌... భార్య కవితా (29) భార్యా భర్తలు. సురేష్‌ కేరళాలో ఉన్న కోలిక్కోడులో మేస్త్రీ పని చేస్తూంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు పాండి మీనా (10), హరిణి (8) ఉన్నారు. 

 

ముచ్చటగా మూడోసారి మగ శిశువు కోసం ఆ దంపతులు ట్రై చేసారు. ఈ క్రమంలో కవితా మూడోసారి గర్భం దాల్చగా... ప్రసవం కోసం ఫిబ్రవరి 20న క.విలక్కు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఇక అదే నెల 26న ఆమెకు సాధారణ  ప్రసవం ద్వారా ఆడ బిడ్డ పుట్టింది. 2 రోజుల తరువాత వారికి డిశ్చార్జ్ ఇవ్వడంతో వారు ఇంటికి వచ్చారు. మూడవ సారికూడా ఆడ పిల్ల పుట్టిందనే నిస్పృహలో.. మార్చి 2న కవిత తల్లిపాలు ఇచ్చినప్పుడు విరోచనాలు ఏర్పడి బిడ్డ మృతి చెందినట్లుగా.. అందరిని నమ్మించి, ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో గొయ్యి తీసి, చనిపోయిన తన బిడ్డను పాతి పెట్టారు. 

 

అయితే, ఈ విషయాన్ని అంతగా నమ్మని కొందరు స్థానికులు, ఆమెపై అనుమానంతో జిల్లా శిశు సంక్షేమ రక్షణ కార్యాలయం, ఆండిపట్టి తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కి  సమాచారం ఇవ్వడంతో.. వారు రంగంలోకి దిగారు. తహసిల్దార్‌ చంద్రశేఖర్‌ గ్రామ నిర్వాహక అధికారి దేవి, రాజధాని పోలీసులు కవితా, అత్త చెల్లమ్మాల్‌ వద్ద తీవ్ర విచారణ చేపట్టారు. గురువారం విచారణలో భాగంగా కవితా, ఆమె అత్త చెల్లమ్మాల్‌ జిల్లేడి పాలు ఇచ్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. 

 

పోలీసులు బిడ్డ మృతదేహాన్ని గురువారం బయటకి తీసి, అక్కడే ప్రభుత్వ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయగా, ఆ రిపోర్టులో జిల్లేడిపాలు ఇచ్చి బిడ్డని హత్య చేసిన విషయం చాలా క్లియర్ గా తేట తెల్లం అయింది. దాంతో వీరి ఇరువురిని... అరెస్టు చేసి, కట కటాల వెనక్కి నెట్టింది సదరు పోలీసు బృందం. యావత్ ఈ సంఘటన మొత్తం అమ్మ దనానికే మాయని మచ్చగా కొందరు మహిళా సంఘాల వారు అభివర్ణించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: