చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా, ఉన్నత స్థానాలకు చేరాలన్నా చాలా కష్టపడాలని తమకు అంత టాలెంట్ లేదని చెబుతూ ఉంటారు. సాధించే సత్తా ఉన్నా వారిపై వారికే నమ్మకం లేక అవకాశాలను కోల్పోతూ ఉంటారు. మనలో చాలామంది ఇదే విధంగా ఉంటారు. ప్రయత్నం చేయకుండానే ఉన్నత ఉద్యోగాలు సాధించడం కష్టమని భావిస్తూ సమయం వృథా చేసుకుంటూ ఉంటారు. 
 
మరికొంతమంది ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం కష్టపడతారు. మొదట్లో బాగానే ప్రయత్నించినా ఆ తరువాత చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలు ఎదురైతే పనిని మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించకుండా మరలా కొత్త లక్ష్యం వైపు దృష్టి పెడుతూ లక్ష్యాలను మార్చుకుంటూ ఉంటారు. ఇలా లక్ష్యాలను మధ్యలోనే వదిలేసి భవిష్యత్తులో తప్పు చేశామని భావిస్తూ ఉంటారు. 
 
కొందరు మాత్రం లక్ష్యాలను నిర్దేశించుకుని మొదటి రోజు నుంచి లక్ష్యాన్ని సాధించే చివరి నిమిషం వరకు కష్టపడతారు. లక్ష్యాన్ని సాధించిన తరువాత కూడా ఉన్నత స్థానాలకు చేరడానికి అనుక్షణం శ్రమిస్తూనే ఉంటారు. నిత్య విద్యార్థిలా కొత్త విషయాలను నేర్చుకుంటూ విజయం కోసం ముందడుగులు వేస్తూ ఉంటారు. ఇలా లక్ష్యం కోసం చివరి నిమిషం వరకు కష్టపడేవారు జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకుంటూ ఉంటారు. 
 
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఓపిక చాలా అవసరం. ఓపిక ఉంటే సులభంగా విజయం సొంతమవుతుంది. ఓపిక ఉన్నవాళ్లు విజయం సాధించే చివరి నిమిషం వరకు కష్టపడుతూ ఉంటారు. ఆటంకాలు, సమస్యలు ఎదురైనా ధృడ సంకల్పంతో ముందడుగులు వేస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాలుగా కష్టపడుతూ బలహీనతలను బలంగా మార్చుకుంటూ విజయం సాధిసూ ఉంటారు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: