విజయాన్ని ఎప్పుడైనా దేనితో కొలుస్తాం.. ఏం సాధించాడన్నది కాదు.. ఎక్కడ నుంచి వచ్చి సాధించాడన్నది సరైన విజయ కొలమానం.. అలా లెక్కేస్తే.. యువ రచయిత వేంపల్లె షరీఫ్‌ సాధించింది తక్కువేమీ కాదు.. తన విజయ ప్రస్థానాన్ని తండ్రికి అంకితమిస్తూ షరీఫ్‌ రాసుకున్న నాలుగు అక్షరాలు మనసుల్ని తాకుతాయి.. శభాష్ అనిపిస్తాయి.. మీరూ చదవండి..

 

**************

 

“సిన్నోన్ని సదివించుకుందాం.. ఇంగ సాల్లే నాయనా..ఇద్దర్నీ సదివించలేను అన్నాడు’’ నాన్న నేను ఇంటర్మీడియెట్ లో ఉండగా. కన్నీళ్లొచ్చాయి.
“ఎవరెంతవరకైనా సదువుకోండి.. సదివిచ్చా..’’ అని నిత్యం అనే నాయన ఇలా యూటర్న్ తీసుకోవడానికి కలసిరాని వ్యవసాయమే కారణం. మా నాయనకు పొట్టకోస్తే అక్షరమ్ముక్క రాదు.
“దీన్నెక్క ఈ సదువు రాక నేను శానా కట్టాలు పడినా. నాబిడ్డలకెందుకు రాదో సూచ్చాం’’ అని కసిగా నన్నునా తమ్మునితోపాటు ఇంతవరకు సదివించడమే గొప్ప.
“ఇంగ సాల్ పో నాయనా. నా సదువు నేను సదువుకుంటా’’ అనుకున్నాను మనసులో.
అప్పటి నుంచి రకరకాల ఉద్యోగాలు చేశాను. ఎస్టీడీ బూత్ లో బోయ్ గా చేరాను. మా ఊరి వేంపల్లె ఏఎన్ ఎల్ లో కొరియర్ బోయ్ గా చేశాను. పొద్దుటూరు లైట్‌ ఫాంలో అరటి పళ్లు అమ్మాను. ఆటో తోలాను.

 

 


“రోజూ క్లాసులకు రాలేను’’ అని సార్లకు చెప్పుకుని సంవత్సరాంతం పరీక్షలకు అప్పటికప్పుడు చదివి ప్రిపేరై రాసి పాసయ్యాను. డిగ్రీ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరాను. ఉద్యోగం చేసుకుంటూనే “పబ్లిక్ రిలేషన్స్’’లో డిగ్రీ చేశాను. తర్వాత జర్నలిజంలో పిజి, ఆ తర్వాత తెలుగులో పిజి. మళ్లీ జర్నలిజంలో ఎంఫిల్ ఇప్పుడు పిహెచ్ డి.
అలసిపోయాను.

 

 


ఒకవైపు ఉద్యోగం, మరోవైపు చదువు, ఇంకోవైపు సాహిత్యం. పెళ్లయ్యాక కుటుంబం. మొదట్లో ఓకే కానీ తర్వాత మేనేజ్ చేయడం కష్టమైంది. అందుకే సాక్షితో పాటు మధ్యలో ఒకట్రెండు ఉద్యోగాలు వదిలేయాల్సి వచ్చింది. వాటివల్ల అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదిఏమైనా ఇవాళ్టికి సంతృప్తిగా ఉంది.

 

 

మా అమ్మ తరపు బంధువుల్లో కానీ మా నాన్న తరపు బందువుల్లో కానీ ఎవరూ చదువుకున్నవాళ్లు లేరు. ఈ బుక్కా ఫకీర్ల ఫ్యామిలీల్లో ఎవరైనా స్కూలు ముఖం చూడ్డమే గొప్ప.. అలాంటిది ఇవ్వాళ ఏకంగా పిహెచ్ డి పూర్తి చేసుకుని మా నాన్న ముందు నిలబడ్డానంటే అందుకు గర్వంగా ఉంది.నేను ఒక పెద్ద చదువు చదివి పాసయ్యానని తెలియగానే మా నాయన కళ్లలో ఆనందం, ఆ వెంటనే కన్నీటి జీర.

 

 

“నేను ఇంకా కొంత కష్టపడి సదివించి ఉంటే నా బిడ్డకు ఇన్ని కష్టాలు ఉండకపోవు కదా..’’ అనే వాత్సల్యం మా నాన్న కళ్ల నిండా కన్నీళ్లయి పరుచుకుని ఉంది. ఆ ప్రేమకు, ఆ కన్నీళ్లకు ఈ పిహెచ్ డి మనస్ఫూర్తిగా అంకితం చేస్తున్నాను. 

 

- -వేంపల్లె షరీఫ్‌ ( ఫేస్‌బుక్‌ వాల్‌ నుంచి ) 

మరింత సమాచారం తెలుసుకోండి: