తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు ఎందరో కామెడీ నటులు వచ్చారు, వెళ్లారు. అయితే వారిలో చాలామంది మంచి పేరు దక్కించుకున్నప్పటికీ, ముఖ్యంగా కొందరు మాత్రం ప్రజల గుండెల్లో తమ ఆకట్టుకునే హాస్యపు జల్లులతో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆ విధంగా తెలుగు వారి గుండెల్లో తన కామెడీతో గొప్ప స్థానం దక్కించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు అని చెప్పాలి. సెప్టెంబర్ 20, 1954 లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం లో జన్మించారు ధర్మవరపు. మొదటి నుండి తెలుగు భాషపై ఎంతో మక్కువ పెంచుకున్న ధర్మవరపు, తాను కాలేజీ విద్యను అభ్యసించే సమయం నుండి పలు నాటకాల్లో నటించారు. 

IHG

ఆపై మెల్లగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి తొలిసారిగా అప్పటి హాస్య బ్రహ్మ జంధ్యాల, అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోగా తాను తీస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో హీరో తండ్రి పాత్ర ఇచ్చారు. కాగా అప్పట్లో మంచి సక్సెస్ సాధించిన ఆ సినిమా తరువాత ధర్మవరపు కు మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు పెరిగాయి. అయితే అటు సినిమాలతో పాటు అప్పట్లో దూరదర్శన్ కేంద్రంలో పలు కామెడీ సీరియల్స్ రూపొందించడం, నటించడం కూడా చేసిన ధర్మవరపు, వాటిలో ఆనందో బ్రహ్మ షో ద్వారా మంచి ప్రేక్షకాభిమానం పొందారు. ఆ తరువాత రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, అలానే సింగర్ గా కూడా పలు విభాగాల్లో పని చేసారు. 

 

ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం కెరీర్ లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో మిస్టర్ పెళ్ళాం, లేడీస్ స్పెషల్, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, నువ్వు నేను, నువ్వే కావాలి, ఆనందం, ఫ్యామిలీ సర్కస్, మన్మధుడు, జయం, ఒక్కడు, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, వసంతం, వర్షం, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, అతడు, బొమ్మరిల్లు, చిరుత, రెడీ, కింగ్, ఖలేజా, దూకుడు సినిమాలు ఉన్నాయి. ఇక ఆ తరువాత అప్పటి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన మంత్రిత్వశాఖలో ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా పనిచేసారు ధర్మవరపు. ఆ విధంగా తన లైఫ్ లో ఎందరో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని నవ్వుల మణిమాణిక్యం గా నిలిచిపోయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013, డిసెంబర్ 7న మనల్ని అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మన మధ్యన లేనప్పటికీ, ఆయన నటించిన సినిమాల్లోని హాస్యపు జల్లులు మాత్రం ఎప్పటికీ మన మనస్సులో గుర్తుండిపోతాయి ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: