వేసవికాలం వచ్చిందంటే ఇంట్లో హడావిడి. మీరు పెట్టారా అంటే మీరు పెట్టారా అని ఒకరిని ఒకరు అడుగ్తూ ఉంటారు. ఇంతకీ దేని గురించి ఈ కుతూహలం అని అనుకుంటున్నారా? అదేనండి మన ఆవకాయ. ఇది పెట్టినప్పుడు ఇంటిలో ఒక పండుగ వాతావరణం, హడావిడి. మిరపకాయలు దంచిన  కారం పొడి తయారు చేసుకోవడం, జాడీలు కడిగి ఆరబెట్టడం, మామిడికాయలు కడిగి తుడవడo, పిల్లలు వీటిని కుతూహలం గా చూస్తూ ఉండడం ఇదంతా ప్రతి వేసవి లో ప్రతి ఇంట్లో జరిగే విషయమే .


సంవత్సరం పొడుగునా అవసరానికి అక్కరకొచ్చే మామిడితో వూరగాయలు పెట్టడం.ప్రతీ సంవత్సరమూ పెట్టే పచ్చడే అయినా, ప్రతీ సంవత్సరమూ అదే ఆతృత, అదే ఖంగారు, అదే ఆనందం. అమ్మో కాయలు పండిపోతాయేమో తొందరగా పెట్టకపోతే అనీ, అయ్యో మరీ టెంక పట్టకపోతే ముక్క మెత్తబడిపోతుంది కదా అనీ ఇన్ని రకాల ఆలోచనలు ఆతృతా ప్రతీ ఆవకాయ పెట్టే వారింట్లో  ఉంటాయి.


మామిడికాయతో పెట్టేవూరగాయలు ఏంటో చూద్దాం :
 ఉప్పు, కారం, నూనె కలిపి ఊరేస్తే ఊరగాయ అనాలి. ఆవకాయ, మాగాయా మెంతికాయా వంటివి. దంచి చేసిన దాన్ని తొక్కు అంటారు చింతకాయ వంటివి. తరిగి, వాడ్చి, లేదా నాన పెట్టి రుబ్బి చేసేవి పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కంది పచ్చడి ఇటువంటివి. 


ఈ ఆవకాయ వివిధ రకాలు 
ఆవపిండి, కారo, ఉప్పు, నువ్వుల నూనె, మెంతులు ఇంగువ . ఈ మెంతులు నాని ఉబ్బిన తర్వాత పుల్లపుల్లగా చాలారుచిగావుంటాయి .... ఇది పచ్చి ఆవకాయ . దీనికి  వెల్లుల్లిపాయలు పైపొర వలిచి వేస్తారు కొందరు. కొన్నిరోజులతర్వాత వెల్లుల్లిపాయలు వూరి భలే రుచిగా ఉంటాయి , దీనిని వెల్లుల్లి ఆవకాయ అంటారు.
 నువ్వుపిండి ఆవకాయ -మొదటి దానితో నువ్వుపిండి పొడిగా వేయించి దంచి  ఆవకాయలో కలపాలి. పెసరపిండి  ఆవకాయ - ఇందులో ఆవబదులు పెసరపిండి (పచ్చిదే) వేస్తారు. విశాఖ ఆపై  ఉత్తర  కోస్తా జిల్లాలలో బెల్లం ఆవకాయ అని పెడతారు.


ఆవకాయ పెట్టు విధానం 
ఒక పాతిక కాయలకి, అంటే 25 కాయలకి, కిలో కారం, కిలో ఆవపిండీ, కళ్ళుప్పు అయితే కిలో అదే మాములు అయొడైజెడ్ ఉప్పు అయితే మూడు పావుల కన్నా కొంచెం ఎక్కువ, శనగలూ, మెంతులూ మన ఇష్టాన్ని బట్టీ వేసుకోవచ్చు. రెండో రకం కొలత ఏంటంటే ఉప్పూ, కారం, ఆవపిండీ, శనగలూ, మెంతులూ అన్ని కలిపి గుచ్చెత్తి ఆ పిండి రెండు గిన్నెలు అయితె ముక్కలు ఒక గిన్నెడూ అనేది కూడా ఒక లెక్క.


ఇప్పుడు ఆవకాయలు ఇంట్లో తయ్యారు చేసి అమ్ముతున్నారు. దేశ విదేశాలకు రవాణా చేస్తున్నారు. ఆవకాయలు ఊరగాయలు పెట్టుకొని లేదా  పెట్టుకోలేకపోయిన వారికి ఇది ఒక వరం వంటిది.   ఈ ఆవకాయలను జాడీలకు ఎక్కించి మూడు రోజుల తరువాత ఇంకొంచెం  నూనె పోసి కలిపి తిరిగి జాడీలలోకి ఎక్కిస్తే ఇంకా సంవత్సరమంతా ఆవకాయ లొట్టలేసుకుంటూ తినొచ్చు.


ఊరి ఊరకుండా  ఆవకాయను తింటే దాని రుచి అద్బుతః 
ఆవకాయ తినోద్దని డాక్టర్లు మొత్తుకున్నా సరే వేడి వేడి అన్నం లో కొత్త ఆవకాయను  తినని తెలుగు వారందరూ అంటే అతిశయోక్తి కాదేమో. క్రొత్త ఆవకాయలో మీగడ తరగ నంజుకు తింటే దాని రుచే వేరు. మజ్జిగ పులుసు పెట్టుకుని మాగాయా టెంక నంజుకు తింటారు తెలుగు వారు. ముద్దపప్పు ఆవకాయ అన్నం ముందు ఏ వంటకం అయినా భాలాదూరే. ఈ మధ్య హోటల్స్  లో కూడా ముద్ద పప్పు ఆవకాయను ఒక ప్రత్యేక వంటకం గా ప్రవేశ పెట్టారు. ఆవకాయ లేని పెళ్ళి భోజనం ఉండదు. ఇప్పుడు హోటల్ ల లో అన్ని రకాల బిర్యనీలతో పాటు ఆవకాయ బిర్యానీ కూడా చేస్తున్నారు.

ఆవకాయకు ఉన్న క్రేజ్ అటువంటిది.  ప్రస్తుత కాలంలో  వంద కాయలు  కాదు కదా కనీసం ఏభై కాయలు పచ్చడి పెట్టేవాళ్లు లేరు.ఒక రెండు నెలలపాటు ఏకబిగిన ఆవకాయన్నం తిని హరాయించుకునే వాళ్లూ లేకపోలేదు. ఈ తరంవారికి (అధిక శాతం మందికి) పచ్చళ్లు పెట్టే తీరిక, ఓపిక రెండూ లేవు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిది ఇన్స్టంట్ గా అయిపోవాలి ఆన్లైన్ లో అయిపోతే ఇంకా మంచిది. ఆవాకాయ రుచిని మరిగిన వారు ఆస్తులు ఆమ్ముకుంటారు అని పూర్వకాలం లో ఒక నానుడి. ఇంతకీ మీ ఇంట్లో ఆవకాయ పేట్టేసారా.!? భారీ వర్షాలు పడబోతున్నాయట.. ఇంకా ఆవకాయ పెట్టనివాళ్లుంటే ముందు ఆ పని పూర్తిచేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: