ఉపాధి కల్పనలో ఇదొక అపూర్వం, ఎలాంటి నైపుణ్యం, ఉన్నత విద్యార్హతలు లేనప్పటికీ పదో తరగతి వరకు చదివిన అమ్మాయిలకు చిత్తూరు జిల్లా,సత్యవేడు లోని శ్రీసిటీ పారిశ్రామిక పార్కులో ఉద్యోగాలు దొరికాయి. గ్రామీణ మహిళలు ఎక్కువగా వ్యవసాయం, ఇంటిపని, వంటపనికే పరిమితం అవుతారు. పారిశ్రామిక పార్క్‌ గ్రామాల్లో మహిళలు ఇందుకు భిన్నంగా తమ సత్తా చాటుతున్నారు. సరైన విద్య, విజ్ఞానం లేకున్నా శ్రీసిటీ హెచ్‌ఆర్‌డి ద్వారా నైపుణ్య శిక్షణ పొంది పరిశ్రమల్లో పలు రకాలు ఉద్యోగాలు చేస్తున్నారు.

మహిళలు ఏమాత్రం సరిపోరు అనుకునే సెక్యూరిటీ పనుల్లో కూడా రాణిస్తూ, ఏ రంగంలోనైనా మగవారితో పోటీ పడగలమని రుజువు చేస్తున్నారు. ఇక్కడి పరిశ్రమలలో 200 మంది మహిళా సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. శ్రమించే తత్వం ఉంటే చదువు లేకపోయినా ఉద్యోగం పొందవచ్చని ఈ రైతుకూలీ మహిళలను చూస్తే అర్థం అవుతుంది. వీరంతా ఐదో తరగతి చదివిన వారు, పదో తరగతి తప్పినవారు. పొలాల్లో మట్టిపనులు చేసుకు బతికేవారు. పని దొరికితే కడుపు నిండేది. లేకపోతే పస్తులే! ఇలాంటి పేద మహిళలకు శ్రీసిటీ చేయూతనిచ్చింది. వారికి సెల్‌ఫోన్‌ తయారీలో, అధునిక దుస్ధుల రూపకల్పనలో,కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడం, సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ ఇవ్వడంతో వారిలో నైపుణ్యం పెరిగింది. \

సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకు చెందిన ఈ బడుగు, బలహీన వర్గాల మహిళలు నేడు ఆత్మవిశ్వాసంతో బైకులు నడుపుతున్నారు. కస్టమ్స్‌ చెక్‌పాయింట్‌ వద్ద యూనిఫామ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. కలుపుతీసే చేతుల్లో కంప్యూటర్లు ఎటువంటి విద్యార్హతలు లేని వారు సైతం, ముఖ్యంగా స్త్రీలు, శ్రీసిటీ మానవ వనరుల శిక్షణా సంస్థలో శిక్షణ పొంది, నైపుణ్యం సాధించి వివిధ వత్తులలో స్థిరపడ్డారు. కలుపుతీసిన చేతులు కంప్యూటర్లను ఉపయోగిస్తున్నాయి. అరక పట్టిన రైతు అధునాతన యంత్రాలపై పని చేయగలుగుతున్నాడు. పూరి గుడిసెల్లో బతికిన బడుగు ప్రజలు, ఆర్థికంగా ఎదిగి, అప్పుల ఊబి నుండి బయటపడి, పక్కా ఇళ్ళల్లో నివసిస్తున్నారు. 

విదేశీ దుస్తులు వీరి చేతిల్లోనే.... 

వీరంతా సరైన చదువులేని గ్రామీణ మహిళలు. పంటల సీజన్‌లో పొలంపనులు, అవి లేనప్పుడు ఖాళీగా వుండేవారు. చిత్తూరు జిల్లా పరిసర గ్రామాలకు చెందిన ఇలాంటి 70 మందికి సుస్థిర ఆదాయం పొందే అవకాశం కలిగింది. ఆధునిక కుట్టు మిషన్లపై దుస్తులు రూపొందించడంలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, కుట్టుపనిలో నిపుణులుగా తయారు చేశారు. నేడు వీరు తయారుచేసిన దుస్తులు ఇంగ్లాండ్‌, ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సూట్లు, ప్యాంట్లు, షర్టులు వంటి వెరైటీ దుస్తులు ఇక్కడ పల్లె మహిళల చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. నెలకు వందలాది సూట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 

మొబైల్స్‌ తయారీ 

చిత్తూరు జిల్లా,సత్యవేడు లోని శ్రీసిటీ పారిశ్రామిక పార్కులో ఏర్పాటైన తైవాన్‌ బహుళజాతి సెల్‌ఫోన్‌ తయారీ సంస్థ రైజింగ్‌స్టార్‌ మొబైల్‌ ఇండియా లి. (ఫ్యాక్స్‌కాన్‌) ప్లాంట్‌లో మూడు షిఫ్ట్‌ల్లో సుమారు 9000 మంది మహిళలు పనిచేస్తున్నారు. సెల్‌ఫోన్‌ విడిభాగాలు తీసుకువచ్చి ఫోన్లు అసెంబుల్‌ చేయడం ఇక్కడి పని. నెలకు దాదాపు 10 లక్షల ఫోన్లు అసెంబుల్‌ చేస్తున్నారు. ప్రపంచమంతా పాపులర్‌ అయిన షియోమి, జియోని, ఆసూస్‌ బ్రాండ్స్‌ ఫోన్లు గ్రామీణ మహిళల చేతుల్లో తయారవుతున్నాయి. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయస్సున్న మహిళలను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి సెల్‌ఫోన్స్‌ అసెంబుల్‌ చేయగలిగేలా తీర్చిదిద్దారు. నెలకు సుమారు రూ . 12 వేలు జీతం వస్తున్నట్లు ఇక్కడ పనిచేస్తున్న మహిళలు చెప్పారు.. పరోక్షంగా బస్సుల సిబ్బందికి కూడా ఉపాధి కలిగింది. ఇంటి నుంచి పది అడుగులు నడిస్తే వచ్చే సిద్ధమ్మ అగ్రహారం గ్రామానికి చెందిన కల్పన, కవిత, దీప ఇలా ఉద్యోగాన్ని పొందినవారే.రెండేళ్ల నుండి సంవత్సరం నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వీళ్ళు ప్రస్తుతం నెలకు 8వేలు సంపాదిస్తూ సంతోషంగా వున్నారు.
మహిళల స్పందన

 ''మాది చిలమత్తూరు. మా పేరెంట్స్‌ ఫార్మర్స్‌. నేను డిగ్రీ చదివా. అలా చదువు పూర్తయిందో లేదో ఇలా శ్రీసిటీలో వున్న రైజింగ్‌ స్టార్‌ మొబైల్స్‌ కంపెనీలో జాబ్‌ వచ్చేసింది. ఐదు నెలల నుంచి జాబ్‌ చేస్తున్నా. మా ఊరు పక్కనే కంపెనీ. ఎలాంటి ఒత్తిడి లేని ఉద్యోగం. అంతా హ్యాపీ. ఎనిమిది వేల జీతం. ఇంటి నుంచి నడిచేంత దూరంలో ఉద్యోగం వుండటం బోలెడంత సౌకర్యం. థాంక్స్‌ టు శ్రీ సిటీ. పది అడుగులు వేస్తే చాలు పరిశ్రమలోకి చేరుకుంటాం''. అంటారు కల్పన, కవిత, దీప. 

సుస్థిర ఆదాయం 

''గతంలో మేం వ్యవసాయ కూలీలం. ఆ పనులు కూడా ఏడాదిలో చాలా తక్కువరోజులే వుంటాయి. మిగతా రోజులు పనుల కోసం వెతుక్కోవాల్సిందే. భూస్వాముల దగ్గర పనికోసం చేతులు కట్టుకొని నిలబడాల్సివచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీసిటీ యాజమాన్యం మాకు శిక్షణ ఇచ్చి ఎం.ఎస్‌.ఆర్‌. గార్మెంట్స్‌లో ఉపాధి కల్పించింది. 6 వేల నుంచి 10 వేల రూపాయల వరకు నైపుణ్యాన్నిబట్టి వేతనాలు ఇస్తున్నారు. దీంతో నేడు సుస్థిర ఆదాయం పొందుతున్నాం. ''. అంటారు శాంతి, మునీంద్ర, గంగమ్మ, భారతి, ఖైలవి. 

జీవన ప్రమాణాలు పెరిగాయి 

''మాది తడగ్రామం. ఎంబీఏ చదివి ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరకు చెన్నయ్‌ గానీ తిరుపతిగానీ పోయి ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామనుకుంటున్న సమయంలో శ్రీసిటీలోని యూనిట్స్‌లో ఉద్యోగావకాశాలున్నాయని తెలిసింది. ముందుగా అలియన్స్‌ మినరల్స్‌ కంపెనీలో కొంతకాలం పనిచేశాను. తరువాత పైలెక్స్‌ ఇండియాలో జూనియర్‌ ఆఫీసర్‌గా 25 వేల వేతనంతో ఉద్యోగం దొరికింది. గ్రామం నుండి ఆఫీసుకు రాను పోనూ ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కల్పించారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, పీఎఫ్‌, క్యాంటీన్‌ సౌకర్యం కూడా ఉంది.'' అంటారు ఎన్‌. జాహ్నవి. 
రెట్టింపు అయిన ఆదాయం 
ఈ ప్రాంత ప్రజల యొక్క ఆర్థిక-సామాజిక స్థితిగతులపై నిర్వహించిన అనేక సర్వేలు, శ్రీసిటీ స్థాపించిన తరువాత ప్రజలు ఆర్ధికంగా గణనీయమైన అభివృద్ధి పొందారని చెబుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: