సీతాఫలం సంవత్సరానికి ఒక్కసారివచ్చే రామాఫలం.శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం ఎన్నో పోషకాల సమాహారం. ఇది కొన్ని రకాల అనారోగ్యాలకు నివారణి కూడా అంతేకాదు.ఈ పండు విశిష్టత ఏంటంటే చలికాలంలో మాత్రమే లభిస్తుంది. రుచి,వాసనలో కాస్త తేడా ఉన్నా సీజన్‌ వస్తోందంటే చాలు ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది.  అమృతఫలాన్నితలపించే సీతాఫలాన్ని కస్టర్డ్‌యాపిల్‌ అనీ,షుగర్‌యాపిల్‌ అనీ పిలుస్తారు.ఇది దక్షిణ అమెరికా దేశాలతోపాటు మనదేశంలోనూ విరివిగా పండుతుంది.ఇక ఈ పండును తినడంతోపాటు దీంతో స్వీట్లు,జెల్లీలు, ఐస్‌క్రీములు, జామ్‌లు చేసుకోవచ్చు.మనందరికీ పండుగానే సుపరిచితమైన ఇది ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మాత్రం అద్భుత ఫలం..




ఈ పండులో వున్న ఔషదగుణాల గురించి చెప్పాలంటే మాత్రం ఎంత చెప్పిన తక్కువే.దీని ఆకులు,బెరడు,వేరు..ఇలా అన్ని భాగాల్నీ అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడతారట.మనదగ్గర కూడా చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు.వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని ఇటీవల కొందరు నిపుణులు చెబుతున్నారు.దీని బెరడుని మరిగించి తీసిన డికాషన్ డయేరియాని తగ్గిస్తుందట.అలాగే ఆకుల కషాయం జలుబుని నివారిస్తుందట.దీనిలో వున్న పోషకాలు:100గ్రా.గుజ్జు నుంచి 94 క్యాలరీలశక్తి..20 -25గ్రాపిండిపదార్థాలు ప్రొటీన్లు.. 4.4గ్రా పీచూ లభ్యమవుతాయి.ఇంకా కెరోటిన్‌,థైమీన్‌,రిబోఫ్లేవిన్‌,నియాసిన్‌,విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా దీనిలో సమృద్ధిగా లభిస్తాయి.




ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది.ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది.పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి పాలల్లో కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుంది.ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే ఫాస్పరస్‌,క్యాల్షియం,ఇనుము లాంటి పోషకాలు ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి.మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇంతలా ఉపయేగపడే ఈ పండుతో నోరూరించే  కొబ్బరి లడ్డూ ఎలా తయారు చేస్తారో చూద్దాం..




కావలసినవి పదార్దాలు:
ఒక కప్పు-సీతాఫలంగుజ్జు-..కొన్ని-యాపిల్‌ముక్కలు..ఒక స్కూప్‌-వెనీలాఐస్‌క్రీమ్‌..నెయ్యి-సరిపడా..రెండుకప్పులు-పాలపొడి..అరకప్పు-కొబ్బరిపొడి..కొంత-జీడిపప్పు..అరకప్పు-బాదంపొడి..పన్నీర్ (సన్నగా తురిమిన)-1/3 కప్పు ..కోవా-పావుకప్పు..యాలకులపొడి-ఒక టేబుల్‌స్పూను..పాలు-పావుకప్పు..చక్కెర-సరిపడా..



తయారీవిధానం:మిక్సిలో సీతాఫలం గుజ్జు,వెనీలా ఐస్‌క్రీమ్‌,యాపిల్‌ ముక్కలు,పాలుచక్కెర,వేసి బాగా గ్రైండింగ్ చేసి దాన్ని పక్కన పెట్టాలి.కడాయి తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి పోసి సీతాఫలం గుజ్జు, యాపిల్‌ ముక్కల మిశ్రమాన్ని అందులో పోసి పది సెకన్లు ఉడికించాలి. ఒక కప్పు పాలపొడి, అరకప్పు కొబ్బరిపొడి, కాజు, బాదం పొడి వేసి ఉండచుట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమంలో కోవా, పన్నీర్ తరుగు, యాలకుల పొడి,మరో కప్పు పాలపొడి వేసి మిశ్రమం చిక్కబడేవరకూ సన్నని సెగపై ఉడికించాలి. ఇందులో పావుకప్పు పాలుపోసి చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించాలి. అది చిక్కబడకపోతే కొద్దిగా పాలపొడి అందులో కలపాలి.అందులో తగినంత చక్కెర, స్పూను నెయ్యి వేసి స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం ఉండచుట్టడానికి వీలుగా లేకపోతే  ఫ్రీజర్‌లో రెండు నిమిషాలు ఉండనిచ్చి తర్వాత తీసి.చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టి కొబ్బరిపొడిలో దొర్లించాలి. తర్వాత నిమిషం పాటు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తింటే చాల రుచిగా వుంటాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: