కాస్తంత ఎక్కువ పులుపు, కాస్త తక్కువ వగరు కలగలిసిన రుచితో గోంగూరను విడిగా వండుకోవచ్చు. అలాగే పప్పు, మాంసాహారాలు దేనితో కలిపి వండినా ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకే దీన్ని వంటల్లో ఎక్కువగా వాడతారు.రుచి పరంగా తెలుగువారికి ఎంత ప్రియమో ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గోంగూరలో విటమిన్సి, విటమిన్-ఏ,ఐరన్, పొటాషియమ్,మెగ్నీషియమ్  చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఇది మంచి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది, కంటి జబ్బులను, రక్తహీనతను నివారిస్తుంది. ఇందులో పీచు పదార్ధాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. మెగ్నీషియమ్ వంటి ఖనిజలవణాల వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మేని నిగారింపునకు, జుట్టు నిగనిగలాడటానికి కూడా గోంగూర సహాయం పడుతుంది. ఇన్ని లాభాలు ఉన్న ఈ గోంగూరతో ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన "గోంగూర పులిహోర" ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

"గోంగూర పులిహోర" కి కావాల్సిన పదార్ధాలు: 
పచ్చి శెనగపప్పు-కొద్దిగ,
 ధనియాలు-కొద్దిగ,
 నువ్వులు-కొద్దిగ,
 ఎండుమిర్చి-5,
 గోంగూర-1 కట్ట,
 నూనె-తగినంత,
 పల్లీలు-కొద్దిగ,
 జీడిపప్పు-కొద్దిగ,
 తాలింపు దినుసులు-తగినంత,
 కట్ చేసిన పచిమిర్చి-5,
 కరివేపాకు-కొద్దిగ,
 ఉప్పు-తగినంత,
 ఉడికించి పెట్టుకున్న అన్నం-1 కప్పు, 
"గోంగూర పులిహోర" తయారుచేయు విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగ పచ్చి శెనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. తరువాత నువ్వులు మరియు ఎండుమిర్చీ కూడా వేసి వేయించుకోవాలి. ఇవ్వనీ కూడా తక్కువ మంట పెట్టి వేయించుకోవాలి అవి వేగాక పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ మరొక ప్యాన్ తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన ఒక కట్ట గోంగూర ఆకులను వేసుకుని నీళ్ళు కాని, నూనె కాని ఏమీ కూడా వేయకుండా తక్కువ మంటతో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరొక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె వేసుకుని నూనె వేడైయ్యాక పల్లీలు, జీడిపప్పు వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు దినుసులు వేసుకుని అవి వేగిన తరువాత కట్ చేసి పెట్టుకున్న పచిమిర్చీ, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి.

ఇవి వేగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా వేయించుకోవాలి, తరువాత ముందుగా చేసి పెట్టుకున పొడిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అందులో చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నంని వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి 3 నిమిషాలు తక్కువ మంటతో కొంచెం సేపు ఉడికించుకోవాలి. చివరిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ, జీడిపప్పులను వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన "గోంగూర పులిహోర" రెడీ.






మరింత సమాచారం తెలుసుకోండి: