ఇప్పుడున్న సమాజంలో ఇంగ్లీషు రాకపోతే కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో నేనే ఒక ఉదాహరణ అంటూ.. వైసీపీ మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.  తాను కూడా 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివానని తర్వాత ఇంటర్‌లో ఇంగ్లీషు మీడియంలో చేరిన మూడు నెలల తర్వాత.. మళ్లీ తెలుగు మీడియంలో చేరి ఇంటర్‌ పూర్తిచేశానన్నారు. డిగ్రీలో మరలా ఇంగ్లీషు మీడియంలో చేరాను. కానీ ఆంగ్లంపై పట్టుసాధించలేకపోయానని తెలిపారు. 


నేటితరం పిల్లలకు అటువంటి గడ్డు పరిస్థితులు రాకూడదనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు మీడియాన్ని అమలు చేస్తున్నారు. అని  వైసీపీ మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. మంత్రి హోదాలో గురువారం తొలిసారిగా ఆమె పశ్చిమ ఏజెన్సీలో పర్యటించారు. బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ‘మన బడి నాడు- నేడు’ కార్యక్రమంలో మాట్లాడారు.


రాష్ట్రంలో మొత్తం 45 వేల పాఠశాలలు ఉన్నాయని, మొదటి విడతలో భాగంగా 15 వేల పాఠశాలల్లో  9 రకాల మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. పోలవరం నియోజకవర్గంలో 132 పాఠశాలలను ఎంపిక చేసి రానున్న మూడేళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో సమస్యలపై నేరుగా తనతోగాని, అధికారులతోగాని మాట్లాడేందుకు టోల్‌ ఫ్రీ నెంబరు 18005991111ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. 


జనవరి 9 నుంచి "అమ్మఒడి" ప్రారంభిస్తున్నట్టు మంత్రి శ్రీవాణి తెలిపారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెంలో ఇంజనీరింగ్‌, ప్రభుత్వ డిగ్రీ రెసిడెన్సియల్‌ కళాశాల, గురుకులాల్లో సీట్లు పెంపు, బర్రింకల పాడులో బాలికల గురుకులాలను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: