ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు అసోం ప్రభుత్వం “అరుంధతి బంగారు పథకం” ను ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద పెళ్లి చేసుకునే అమ్మాయిలకు "తులం బంగారం" ఉచితంగా అందించనున్నారు. మేజర్లు అయ్యి వివాహం చేసుకునే వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. అలాగే పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు మాత్రమే ఈ పథకాన్ని అందజేయనున్నారు.

ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఇది 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ  బుధవారం వెల్లడించారు.. బాల్య వివాహాల్ని అరికట్టడంతో పాటు, అమ్మాయిలను కూడా విద్యలో ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టామని మంత్రి హిమంత బిశ్వకర్మ తెలిపారు.  

ఈ పథకానికి సంబంధించి  కొన్ని విధివిధానాలు కూడా  మంత్రి ప్రకటించారు.  రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్‌లో డిపాజిట్ చేయనుంది. ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో.. అప్పుడు ఉన్న బంగారం ఖరీదును బట్టి.. పథకం ద్వారా ఇచ్చే నగదులో మార్పులు ఉంటాయి. 1954 ప్రత్యేక వివాహ (అసోం) నిబంధనల ప్రకారం వివాహాలను అధికారికంగా నమోదు చేసిన తరువాత ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. 

అర్హతలు: కనీస వివాహ వయస్సు వధువు (18), వరుడు (21) ఏళ్లు ఉండాలి. వధువు కనీసం 10వ  తరగతి వరకు చదువుకొని ఉండాలి.
వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయించాలి. వధువు  సంరక్షకులు (తండ్రి, తల్లి) వార్షిక ఆదాయం రూ. 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి.

 ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు ఆర్ధిక సాయం అందిస్తున్నాయి. తెలంగాణలో కళ్యాణ లక్ష్మీ అందిస్తున్నారు. ఈ పథకం కింద రూ.1 లక్ష 116 రూపాయలు అందజేస్తున్నారు. అసోంలో అక్షరాస్యత రేటు తక్కువ మరియు బాల్య వివాహాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన అరుంధతి బంగారు పథకం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: