నార్మ‌ల్ డెలివ‌రీ కావాల‌ని ప్ర‌తీ మ‌హిళ కోరుకుంటుంది. కానీ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది మాత్రం అందుకు విరుద్ధం. కాన్పు అనగానే క‌డుపుకోత త‌ప్ప‌దు అన్న‌ట్లుగా ప‌రిస్థితిని మార్చేశాయి ఆస్పత్రులు. అయితే ఇందులో పూర్తిగా ఆస్ప‌త్రుల‌ను కూడా త‌ప్పు ప‌ట్ట‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే పురిటి నొప్పులు కూడా త‌మ బిడ్డ‌, కోడ‌లు, భార్య భ‌రించ‌కూడ‌దు...అనే ఆలోచ‌న ధోర‌ణి కూడా  ఆప‌రేష‌న్ల‌కు పురికొల్పుతోంది. 

 

అయితే క‌నీస వ్యాయామం..డాక్ట‌ర్ చెప్పిన డైటు పాటిస్తే నార్మ‌ల్ డెలివ‌రీ అనేది పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని వైద్యులు చెబుతున్నారు. దీనికి కావాల్సింద‌ల్లా కాసింత శ్ర‌ద్ధ‌...మంచి ఆరోగ్యం పొందాల‌న్న దృక్ప‌థం..ఇంకాస్త ధైర్యం ఉంటే చాల‌ని సూచిస్తున్నారు. వ్యాయామాల్లో కూడా ఇంటి ప‌నులు చ‌క్క‌దిద్దుకోవ‌డం వంటివి చేస్తే స‌రిపోతుంద‌ని, వీలైన వాళ్లు యోగాల్లోని కొన్ని ఆస‌నాల‌ను పాటించ‌డం వ‌ల్ల క‌డుపులోని బేబీ క‌ద‌లిక‌లు..నార్మ‌ల్ డెలివ‌రీకి దోహ‌ద‌ప‌డే కండ‌రాలు సంకో చించ‌డం...వ్యాకోచించ‌డం జ‌రుగుతుంద‌ని గుర్తు చేస్తున్నారు. 

 

అయితే ఈ వ్యాయామాలు మొద‌టి నెల నుంచి కాకుండా నాలుగు నెల‌ల త‌ర్వాత ఆరు, ఏడు నెలల వరకూ చేయాలని సూచిస్తున్నారు. నిజానికీ ఆరోగ్యంగా ఉన్న మహిళలు అయితే అంతగా నొప్పుల సమస్యని ఎదుర్కోరని చెబుతారు కాబట్టి.. గర్భం దాల్చిన ప్రతి మహిళ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి డైట్ తీసుకోవాలి. పూర్వ‌కాలంలో మ‌హిళ‌లు పురిటి నొప్పులు భ‌రించే జ‌న్మ‌నిచ్చారు. కానీ అటు త‌ర్వాత వారికి ఎదుర‌య్యే ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా చాలా త‌క్కువేన‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 

కానీ ప్ర‌స్తుతం నార్మ‌ల్ డెలివ‌రి అన‌గానే ముందు ఆస‌క్తి చూపుతున్న గ‌ర్భిణులు కొద్ది స‌మయం ఆలోచించి భ‌య‌మేస్తోంది అంటూ అభ‌ద్ర‌త భావాన్ని వెల్ల‌డిస్తున్నార‌ట‌. ఈ కార‌ణంగానే ఆస్ప‌త్రుల్లో కూడా క‌డుపుకోత‌లు పెరిగిపోతున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయినప్పట్నుంచే మహిళ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు నిపుణులు..

మరింత సమాచారం తెలుసుకోండి: