మహిళలు, చిన్నారులపై దారుణాలకు ఒడిగట్టే వారికి తక్షణమే తీవ్రమైన (ఉరిశిక్ష) శిక్ష విధించేలా, సమీక్షకు ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కేటీఆర్ కోరారు. ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ)లను సవరించాలని కోరారు. చట్టాలను సవరించడానికి సమయం ఆసన్నమైందన్నారు.

దేశంలో మహిళలపై నేరాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలని ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. వరుస ట్వీట్లు చేసిన ఆయన.. అత్యంత పాశవికమైన నిర్భయ రేప్, హత్య ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా.. నిందితులను ఇప్పటికీ ఉరి తీయలేదన్నారు.ఇటీవలే 9 నెలల పసికందను రేప్ చేసి చంపేశారు. కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. హైకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. హైదరాబాద్ లో  యువ వెటర్నరీ డాక్టర్‌ను పాశవికంగా హత్య చేశారని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు.

చట్టాలంటే భయం లేని ఇలాంటి మృగాల బారి నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని అభ్యర్థించారు. మోదీజీ.. నిస్సహాయులైన లక్షలాది మంది ప్రజల తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. మన చట్టసభ్యులు ఈ విషయమై స్పందించి.. బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని కోరుతున్నానని కేటీఆర్ కోరారు. 

ఇటీవల శంషాబాద్ దారుణ హత్య ఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ.. వెటర్నరీ డాక్టర్‌ను హత్య చేసిన నిందితుల్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు చేతగాకపోతే.. నిందితులను మాకు అప్పగించండని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా.. బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలకు మార్పులు చేయబోతున్నట్టు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారమే తెలిపారు. మహిళలు, చిన్నారులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చేస్తామన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: