తెల్లవారుజాము నుండి దేశవ్యాప్తంగా మారు మోగిపోతున్న ఒకే ఒక్క  పేరు విసి సజ్జనార్. కర్నాటక వాస్తవ్యుడైన ఐసిఎస్ అధికారి  విశ్వనాధ చెన్నప్ప సజ్జనార్ ఇపుడు దేశవ్యాప్తంగా హీరో అయిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున  శంషాబాద్ మండలంలోని చటాన్ పల్లిలో దిశ హత్యాచార నిందుతులు నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారన్న విషయం ఎప్పుడైతే వెలుగు చూసిందో అప్పటి నుండే సజ్జనార్ కు జనాలు నీరాజనాలు పడుతున్నారు.

 

దేశంలోని సెలబ్రిటీలందరూ తమ ట్విట్టర్ ఖాతాల్లో తెలంగాణా పోలీసులకు, ముఖ్యంగా సజ్జనాన్ ను అభినందిస్తు పోస్టులు పెడుతున్నారు. ఇక తెలుగు సినిమాల్లోని సెలబ్రిటీలు నాగార్జున, చార్మి, సమంత, అల్లు అర్జున్, మంచు లక్ష్మి, జూనియర్ ఎన్టీయార్, నాని మంచుమనోజ్ ఇలా చాలామంది సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   తెలంగాణా పోలీసుల ఖ్యాతిని సజ్జనార్ దేశానికి తెలిసేట్లు చేశారంటూ అభినందిస్తున్నారు.

 

అదే విధంగా ఉదయం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూడటానికి వస్తున్న జనాలు కూడా పెద్ద ఎత్తున పూల బుట్టలు తీసుకొస్తున్నారు. ఘటనా ప్రాంతంలోని ఫ్లై ఓవర్ పైకి జనాలు ఎక్కి బుట్టలతో పూలుచల్లుతు పోలీసులను ముంచెత్తుతున్నారు. అంటే పోలీసులపై ఉదయం నుండి పూలవర్షం కురిపిస్తున్నారు. విచిత్రమేమిటంటే 2008లో వరంగల్ జిల్లాలో కూడా ముగ్గురు యువకులు ఎన్ కౌంటర్ అయ్యారు. ఓ అమ్మాయిపై యాసిడ్ దాడి చేశారు. అప్పుడు కూడా  ఇదే విధంగా వాళ్ళు ఎన్ కౌంటర్ అయిపోయారు.  అప్పుడు ఎస్పీ కూడా సజ్జనారే. 

 

సినీనటి ఛార్మి మాట్లాడుతూ ఈరోజు దీపావళి పండుగ వచ్చినట్లుందని చెప్పారు. దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని తెలియగానే జనాలు టపాకాయలు కాల్చటాన్ని ఛార్మి గుర్తుచేశారు. అంటే జనాలకు ఈరోజు నిజమైన దీపావళి వచ్చినట్లుందని ఉద్వేగంతో చెప్పారు.

 

దిశపై హత్యాచారం తర్వాత మహిళలు పడుతున్న భయానికి, ఆందోళనకు పోలీసులు చేసిన ఎన్ కౌంటరే సమాధానం చెప్పిందని సమంత చెప్పటం గమనార్హం. ఎన్ కౌంటర్ తప్పే అయినా అప్పుడప్పుడు ఇలానే సమాధానం చెప్పాల్సుంటుందని సమంత అభిప్రాయపడ్డారు. హోలు మొత్తం మీద ఎవరు మాట్లాడినా, ఎవరు అభినందించినా మొత్తానికి సజ్జనార్ అయితే దేశంలో హీరో అయిపోయారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: