బాలికలు కూడా సైనిక పాఠశాలలో 
బాలికలకు మొదటిసారి మిజోరాం సైనిక పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. అక్కడ విజయవంతం కావటంతో దేశ వ్యాప్తంగా అన్ని సైనిక పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బాలిలక విభాగం ఏర్పాటు చేయనున్నారు. బాలికలను చేర్చుకునేందుకు మౌలిక వసతులు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు.


జాతీయ భావాలు..
తల్లిదండ్రులు ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇలా పెరిగిన పిల్లలు మాత్రమే పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకుంటారు. దేశం కోసం పరితపించే వారిలోనే నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. దేశభక్తి కలిగిన పౌరుడు కుటుంబ విలువలను గుర్తిస్తాడు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించడం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కుటుంబ పెద్దలు కృషిచేయాలి.


సైనికుల సేవలు..

దేశాన్ని తీర్చిదిద్దే విషయంలో యువత ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే అలనాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, నేడు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలు కారణం. ఎముకలు కొరికే చలిలో కూడా దేశం కోసం పని చేస్తున్న సైనికుల గురించి నేటి యువత ఆలోచించాలి. తమ ఆలోచనలలో మార్పు రావాలి. దేశంలోని యువతకు తప్పనిసరిగా సైన్యంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం పై తీవ్రస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగపూర్‌తో పాటు మరికొన్ని దేశాలు తమ తమ దేశాల్లోని యువతీ యువకులకు ఆరు నెలలు లేదా ఏడాది కాలం పాటు సైనిక శిక్షణను ఇస్తున్నాయి. ఈ శిక్షణ ద్వారా యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెరగడంతో పాటు విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకోవాలనే అంశంపై సైతం అవగాహన ఏర్పడుతుంది.


నైతిక విలువలు..

సాహసోపేతమైన చర్యలకు చిరునామాగా నిలచిన యువత, తమను తాము సంస్కరించుకునే స్వభావాన్ని అలవరచుకోవాలి.  పాఠ్యంశాలమీదనే దృష్టి పెట్టకుండా, యువతను ఉత్తేజపరచే విషయాలను, నైతిక విలువలను పెంపొందించే సారాన్ని రుచి చూపించటం చాలా అవసరం. సైనిక ప్రతిభా పాటవాలను తప్పనిసరిగా వారానికి ఒకరోజు కేటాయించి క్రమశిక్షణకు బాటలు వేయాలి.


మిలిటరీ క్రమశిక్షణ యువత సన్మార్గం..
మానవత్వం మంట కలుస్తోంది. మానవ సంబంధాల పట్ల విలువలు తగ్గుతున్నాయి. జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి.. అమాయక ఆడపిల్లల ఉసురుతీసి ఊరేగుతున్న యువత సన్మార్గంలో నడవాలంటే మిలిటరీ క్రమ శిక్షణ అలవరచుకోవాలి.


ఆడపిల్లలపై అకృత్యాలకు చెక్..
ఆధునికంగా సాంకేతిక రంగంలో దూసుకు పోతూ విలువలను మరిచిపోతున్న ఈ సమయంలో అన్న చెల్లెల్లే అనుబంధం, కుటుంబ విలువల ఉనికినీ, ప్రాధాన్యాన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ అనుబంధాలను విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి పైన  ఉంది. మహిళను సోదరిగా భావించి గౌరవించాలానే భావన ప్రతి మగవాడిలో వస్తే భవిష్యత్ లో ఆడపిల్లలపై అకృత్యాలకు చెక్ పెట్టవచ్చు. మర్చిపోతున్నఅనుబంధం, విలువలను పెంపొందిస్తూ ఆనందమయ జీవితానికి అడుగులు పడాలంటే మిలిటరీ సాంప్రదాయాన్ని బాల్యదశ నుండే అలవరచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: