వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. పోలీసులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే డిమాండ్ తో సామాజిక కార్యకర్త  సంజయ్ సుప్రింకోర్టులో కేసు వేశారు.  ఇప్పటికే దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ వివాదంలో పోలీసులు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే.

 

హత్యాచార ఘటన వెలుగు చూడగానే దేశవ్యాప్తంగా జనాలందరూ నిందితులను వెంటనే ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. మరికొందరైతే నిందితులను తమకు అప్పగించాలని, మరికొందరు వాళ్ళని ఎన్ కౌంటర్ చేసేయాలంటూ పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెంచారు. రాజకీయంగా పెరిగిన ఒత్తిళ్ళు, మామూలు జనాల్లోని మూడ్ ను చూసిన తర్వాత పోలీసుల్లో కూడా టెన్షన్ పెరిగిపోయింది. సరే కారణాలు ఏవైనా కానీ మొత్తానికి నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ అయిపోయారు.

 

విచిత్రమేమిటంటే ఎన్ కౌంటర్ ముందు ఒకరకమైన ఒత్తిడిని ఎదుర్కొన్న పోలీసులపై ఎన్ కౌంటర్ తర్వాత  మరొరకమైన ఒత్తిడి మొదలైంది. ఎన్ కౌంటర్ ను ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ మానవహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు కోర్టుల్లో కేసులేశాయి. ఫలితంగా సూమోటోగా ఎన్ కౌంటర్ ఘటనను జాతీయ  మానవహక్కుల కమీషన్ టేకప్ చేసింది. దాంతో పోలీసులకు సమస్యలు మొదలయ్యాయి.

 

ఎందుకంటే తాము  చేసిన ఎన్ కౌంటర్ ను పోలీసులు జాతీయ మానవహక్కుల కమీషన్ ముందు సమర్ధించుకుంటూ ఆధారాలు చూపించాలి. ఎన్ కౌంటర్ ను సమర్ధించుకోవటంలో పోలీసులు ఇబ్బందిపడినట్లు  సమాచారం. ఇదిలా ఉండగానే హై కోర్టు తర్వాత సుప్రింకోర్టు కూడా కేసు విచారణ మొదలుపెట్టాయి. సరే తర్వాత హై కోర్టు కేసుల విచారణను విరమించుకున్నది.

 

అదే సమయంలో సుప్రింకోర్టు కూడా ఎన్ కౌంటర్ ఘటనను విచారించేందుకు ముగ్గురు సభ్యుల కమీషన్ వేసింది. దాంతో పోలీసుల సమస్యలు మరింతగా పెరిగింది. ఈ నేపధ్యంలోనే పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు డిమాండ్ చేస్తు కేసు వేయటం మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. మరి తాజా కేసుతో సుప్రింకోర్టు ఎలా స్పందిస్తున్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: