దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ హత్య కంటే ముందే నలుగురు నిందితులు మరో 9మంది మహిళలపై హత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా పోలీసుల విచారణ తేలింది. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలంలో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రధాన సూత్రధారి ఆరిఫ్‌ అలీ 6 హత్యలు.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించారని తెలుస్తోంది. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాల సమాచారం. ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృతదేహాలను దిశ మాదిరిగానే దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గతంలో జరిగిన హత్యలకు సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్టులను పోలీసులు పరిశీస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీస్తున్నారు. దీని కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.


దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేధించాలని పోలీసులు చెబుతున్నారు. అయితే డీఎన్‌ఏ పరిశీలనలో భాగంగా పలు పాత కేసుల్లో ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్, ల డీఎన్ఏ లతో మరిన్ని హత్య కేసుల్లో మ్యాచ్ అవుతున్నట్లు సమాచారం. దీంతో విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ఆధారాలు  సేకరిస్తున్నారు. నిందితులు డీఎన్‌ఏతో గత హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ​కాగా దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.  ఎన్‌కౌంటర్‌పై కేసు కోర్టులో విచారణ జరుగుతుండటంతో మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు.


దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు యువకుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి శవాగారం(మార్చురీ)లో భద్రపరచడంపై ఆసుపత్రి వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు వాటిని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచిన విషయం తెలిసిందే. అయితే రోజులు గడుస్తుండటంతో అవి కుళ్లిపోతున్నట్లుగా గుర్తించారు. నిజానికి ఈనెల 13 వరకే వాటిని భద్రపరచాలని చెప్పిన గడువు ముగిసినా వాటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎంబాంబింగ్‌ చేస్తే రెండు వారాలపాటు భద్రపరచవచ్చు. కానీ రీ పోస్టుమార్టానికి అవకాశం ఉండదు. ఎంత శీతల ప్రదేశంలో ఉంచినా వారం వరకే ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించి ఆసుపత్రి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో తీర్పు రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మృతదేహాలను దిల్లీలోని అధునాతన మార్చురీకి తరలించాలని ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నాలు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: