సీరియల్ కిల్లర్.. ఈ మాట వింటే చాలు ఎంతటి వ్యక్తికైనా కాళ్లు, చేతులు వణికిపోతాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తారో, ఎంత దారుణంగా చంపుతారో తెలియని ఇలాంటి హంతకుల గురించి సినిమాలు, నవలలు ద్వారా తెలుసుకొనే ఉంటారు. వారంతా ఏదో ఒక ఆధారం వదిలి పోలీసులకు దొరికిపోయి ఉంటారు. కానీ, మీరు ఇప్పుడు చదవబోయే నరహంతకుడు ఆ టైపు కాదు. శతాబ్దాలు గడిచిపోయినా అతడి ఆచూకీ తెలియలేదు. ఇకపై తెలియదు కూడా. అతడే ‘జాక్ ది రిప్పర్’. ఇది అతడి సొంత పేరు కాదు.. అతడు ఇచ్చిన ఆధారాలతో పత్రికలు పెట్టిన నిక్ నేమ్. వరుస హత్యలతో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన జాక్ ది రిప్పర్ గురించి ఎన్నో సినిమాలు, సీరియళ్లు కూడా వచ్చాయి. ఎందరో సీరియల్ కిల్లర్లు.. ఇతడి హత్యా విధానాలను అనుసరించారు. పక్కా ప్రణాళికతో హత్యలు చేస్తూ.. శవాల్లోని అవయవాలను మాయం చేస్తూ.. పోలీసులకు లేఖలు రాసి మరీ సవాల్ విసిరిన ఆ కిరాతకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

లండన్‌లోని వైట్‌చాపెల్ పోలీస్ అధికారికి బస్తాల కొద్ది లేఖలు వచ్చాయి. వాటిలో ఒక డబ్బా కూడా ఉంది. ఆ డబ్బాను తెరిచి చూసిన పోలీసులకు అందులో వైన్ కనిపించింది. దాని లోపల ఓ అవయవం కూడా ఉంది. దీంతో హడలిపోయిన పోలీసులు.. ఆ డబ్బాతోపాటు వచ్చిన ఓ లేఖను చదివాడు. ‘‘నరకం నుంచి రాస్తున్న లేఖ ఇది.. వైనులో ఉన్నది మహిళ కిడ్నీ. అందులో సగ భాగాన్ని నేను వేపుకుని తినేశాను. మిగతాది మీకు పంపించాను. ఇలాంటివి ఇంకా జరుగుతాయి. దమ్ముంటే నన్ను పట్టుకోండి. మీ జాక్ ది రిప్పర్’’ అని అందులో రాసి ఉంది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, అతడి ఆచూకీ లభించలేదు. ఈ లేఖ అందుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులకు మరో శవం దొరికింది. అది కూడా మహిళదే.

 

ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు దారుణమైన స్థితిలో ఓ మహిళ శవం కనిపించింది. ఆమె శరీరం మొత్తం వలిచివేసినట్లుగా ఉంది. శరీరంలోని కిడ్నీ, గుండె, యోని, పేగులతోపాటు ముఖంలోని కొన్ని కండరాలు, రక్త నాళాలు కోసినట్లు ఉన్నాయి. దీంతో పోలీసులు ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. వైట్‌చాపెల్ పరిసరాల్లో గట్టి నిఘా ఉంచారు. సీరియల్ కిల్లర్ గురించి దిన పత్రికల పతాక శీర్షికలో కథనాలు ప్రచురించాయి. ఈ వార్త దావనంలా వ్యాపించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.


అది 1888 సంవత్సరం. సీరియల్ హత్యలు జరుగుతున్న సమయంలో లండన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీకి ఓ లేఖ వచ్చింది. దాన్ని ఆ హంతకుడే పంపి ఉండవచ్చని అంతా భావించారు. అందులో అతడు ఇచ్చిన హింట్ ప్రకారం.. అతడి పేరును ‘జాక్ ది రిప్పర్’ అని ఆ పత్రిక పేర్కొంది. ఈ కథనాన్ని పతాక శీర్షికన ప్రచురించడంతో ‘జాక్ ది రిప్పర్’ పేరు మారుమోగింది. అయితే, అది ఫేక్ ఉత్తరం కావచ్చని, ప్రజల్లో ఆసక్తి రేకెత్తించేందుకు ఓ విలేకరి ఈ కట్టు కథను అల్లి ఉంటాడని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరికి ఆ పేరే నిలిచిపోయింది.

 

జాక్ ది రిప్పర్ చేసిన హత్యల్లో ఎక్కువ మంది బాధితులు వేశ్యలే. హత్యకు ముందు బాధితులను దారుణంగా హింసించేవాడని, బతికి ఉండగానే శరీరాన్ని చిల్చేవాడని పలు కథనాలు పేర్కొన్నాయి. కంఠాన్ని కోసి, అంతర్గత అవయవాలను మొత్తం తొలగించేవాడు. ఈ నేపథ్యంలో అతడికి తప్పకుండా శరీర నిర్మాణంపై అవగాహన ఉండేదని, తప్పకుండా శస్త్ర చికిత్సలో పరిజ్ఞానం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానించారు. వేశ్యలు రాత్రి వేళల్లో వీధుల్లో తిరుగుతుంటారని, వారిని లక్ష్యంగా చేసుకుంటే ఎవరికీ అనుమానం రాదని రిప్పర్ భావించి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. పైగా, వారి ఇళ్లకు ఎక్కువ మంది వచ్చి పోవడం వల్ల తనని ఎవరూ గుర్తించలేరనే ధీమాతో వేశ్యలను లక్ష్యంగా చేసుకుని ఉంటాడని భావించేవారు.


1888లోని సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో పత్రికా కార్యాలయాలకు గుట్టలు గుట్టలుగా లేఖలు వచ్చేవి. అవన్నీ జాక్ ది రిప్పర్ పంపిన ఉత్తరాలేనని భావించేవారు. ఈ హత్యలను పత్రికలు తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేశాయి. సీరియల్ కిల్లర్, హత్యలు గురించి వివరిస్తూ ప్రత్యేక కథనాలను రాస్తూ సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో.. హంతకుడు వైట్‌ఛాపెల్‌లోని నిఘా కేంద్రానికి ఓ ఉత్తరంతో కిడ్నీలో ఒక భాగాన్ని పంపి మరింత ప్రచారం పొందాడు. ఆ తర్వాత కూడా మారణకాండ ఆగలేదు. 1891 వరకు ఈ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. జాక్ ది రిప్పర్ ఈ హత్యలు చేస్తున్నాడనే ప్రచారంతో.. హంతకుడు ఒకడా? లేదా అతడిని అడ్డుపెట్టుకుని మరెవ్వరైనా హత్యలు కొనసాగిస్తున్నారా అనే అనుమానాలతో పోలీసులు దాదాపు వందకు పైగా అనుమానితులను విచారించి వదిలిపెట్టారు. హంతకుడిని పట్టుకోవడంలో విఫలమైనందుకు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.


మేరీ అన్నా నికోలస్ అనే మహిళ 1888 ఆగస్టు 31వ తేదీ తెల్లవారుజాము 3.40 గంటలకు శవమై కనిపించింది. ఆమె అర్ధరాత్రి తర్వాత 2.30 గంటలకు వైట్‌చాపెల్‌లోని బుక్స్ రోలో వీధిలో తిరగడాన్ని చూశామని కొంతమంది సాక్ష్యులు తెలిపారు. ఆమె కంఠంపై తీవ్రమైన కత్తిపోట్ల ఉన్నాయి. ఆమె ఉదరం, తదితర భాగాల్లో దారుణమైన కోతలు ఉన్నాయి. శరీరంలో ఒక్క అవయవం కూడా మిగల్చకుండా, చివరికి యోనిని సైతం హంతకుడు ఎత్తుకెళ్లాడు.


రెండో హత్యతో జాక్ ది రిప్పర్ ఆనవాళ్లను కొంతమంది చెప్పారు. అయితే, అతడి ముఖం ఏవిధంగా ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేకపోయారు. నల్లని వెంటుకలతో ఉన్న అతడు వేటగాళ్ల టోపీ, పొడవైన కోటు ధరించాడని చెప్పారు. రెండో బాధితురాలు అన్నియే చంప్మన్‌‌ను తాము ఉదయం 5.30 అరగంట తర్వాత ఆమె ఆర్తనాదాలు విన్నామని కొందరు తెలిపారు. మొదటి బాధితురాలి తరహాలోనే ఈమె కంఠం కూడా చీల్చివేశాడు. కడుపును పూర్తిగా కోసేసి, గర్భాశయాన్ని సైతం ఎత్తుకెళ్లిపోయాడు.


మూడో బాధితురాలి ఎలిజిబెత్‌ను సెప్టెంబరు 30న హత్య చేశాడు. వైట్‌ఛాపెల్‌లోని బెర్నెర్ స్ట్రీట్ (ఇప్పుడు హెన్రీక్యూస్ స్ట్రీట్)లోని డట్‌ఫీల్డ్స్ యార్డ్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1 సమయంలో ఆమె శవమై కనిపించింది. అయితే, మొదటి రెండు హత్యల్లా ఆమె శరీరం చిధ్రం కాలేదు. కేవలం గొంతు వద్ద మాత్రమే గాయం ఉంది. హంతకుడు నరాన్ని కోయడం వల్ల ఆమె రక్తం కోల్పోయి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె చంపింది ప్రియుడేనని పలువురు చెప్పారు. అలాగే, హంతకుడి పోలీసులను కూడా పూర్తి విరుద్ధంగా చెప్పడంతో ఈ కేసు కూడా గందరగోళంగా మారింది. కానీ, హంతకుడు ఈ శవంలోని అవయవాలను ఎందుకు తీసుకెళ్లలేదు? హత్య చేసింది ఆ సీరియల్ కిల్లరేనా అనే అనుమానాలు కలిగాయి.


హత్య జరిగిన రోజే కాథెరినే ఎడ్డోయెస్, స్ట్రెడే అనే ఇద్దరు మహిళల హత్య జరిగింది. వీరి శవాలు 45 గంటల తర్వాత లభించాయి. గత హత్యల తరహాలోనే హంతకుడు వీరి కంఠాన్ని కూడా రెండుగా చీల్చేశాడు. ఎడమ మూత్రపిండం, గర్భాశయాన్ని తొలగించాడు. స్ట్రెడే ధరించిన ఓ వస్త్రం రక్తపు మరకలతో ఓ గోడ వద్ద లభించింది. ఆ గోడమ యూధులకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్నాయి. వాటిని ప్రజలు చూసినట్లయితే వర్గాలుగా విడిపోయి అల్లర్లు మొదలవుతాయని పోలీసులు భావించారు. దీంతో ఆ రాతలను తుడివేయించారు. అయితే, అవి హంతకుడే రాశాడా, లేదా ఆ రాతలు ఉన్న ప్రాంతంలో ఆమె వస్త్రాలను వదిలిపెట్టి వెళ్లాడా అనేది మాత్రం తెలియరాలేదు.


నాలుగో బాధితురాలు కాథెరినే ఎడ్డోయెస్ హత్య తర్వాత రిప్పర్ వదిలిపెట్టిన సిల్క్ షాల్ మీద రక్తంతోపాటు అతడి వీర్యం కూడా పడి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్పట్లో అనుమానించిన అరోన్ కస్మోయినిస్కీ (23) కుటుంబికుల నుంచి సేకరించిన డీఎన్ఏతో వీర్యం కనుగొన్న డీఎన్ఏను మ్యాచ్ చేసి చూడగా ఒకటేనని తెలినట్లు ‘జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్’లో పేర్కొన్నారు. 2014లో బ్రిటీష్ వాణిజ్యవేత్త రిప్పర్ రాసిన పుస్తకంలో కస్మోయినిస్కీ గురించి రాశారు. జాక్ ది రిప్పర్ హత్యాకాండల విచారణలో అతడు ప్రధాన అనుమానితుడుగా ఉండేవాడని పేర్కొన్నారు. అయితే, అతడే హత్యలు చేసినట్లు అప్పట్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కస్మోయినిస్కీని తప్పించుకోగలిగాడు. అప్పట్లో డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేకపోవడం వల్ల హంతకుడు చాలా తేలిగ్గా తప్పించుకోగలిగాడు. అయితే, ప్రస్తుత ఆధారాలను బట్టి కస్మోయినిస్కీనే హంతకుడని చెప్పలేమని, డీఎన్ఏ పరిశోధనలకు ఉపయోగిన సాల్ శతాబ్ద కాలం నాటిదని తెలుపుతున్నారు. చనిపోయినది వేశ్య కాబట్టి.. ఆమె వస్త్రం మీద వీర్యం ఉండటం సాధారణమేనని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: