బెంగళూరు లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళా కండక్టర్ పై ఇద్దరు దుర్మార్గులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం మహిళా కండక్టర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హవనూరు లేఅవుట్‌లో నివాసం వుండే బాలాజీ, ఇందిరబాయి దంపతులు ఇద్దరూ కర్ణాటక ఆర్టీసి ఉద్యోగులు భర్త బాలాజీ డ్రైవర్ కాగా ఇందిరబాయి బస్సు కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ విధులకు హాజరుకావడానికి భార్యా భర్తలు హవనూరు లేఅవుట్‌ నుంచి బస్సు డిపో కు వెళ్తుంటారు. 

 

ఈ క్రమంలో నిన్న (డిసెంబర్ 19) తమ నివాసం నుంచి ఉదయం 6 గంటలకు బస్సు డిపో కు ఇందిరబాయి నడిచి వెళ్తుండగా ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు మహిళా కండక్టర్ పై యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. ఇందిరబాయి గట్టిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని కాలనీ వాసులు వచ్చి చూడగా యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది ఇందిరబాయి. కాలనీ వాసులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. 

 

ప్రస్తుతం ఇందిరబాయి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు పాల్పడిన దుండగులు ఎవరో అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళా కండక్టర్ పై జరిగిన దాడిని ఆర్టీసి కార్మికులు ఖండించారు. ఘటనకు పాల్పడిన నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలాజి దంపతులు ఇటీవలే ఈ హవనూరు లేఅవుట్‌ కు వచ్చారని కాలనీ వాసులు చెప్తున్నారు. గతంలో ఇందిరబాయి దంపతులతో ఎవరైనా గొడవ పెట్టుకున్నారేమో అన్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి మహిళా సంఘాలు. మహిళలపై ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండాలంటే కఠిన చట్టాలు అమల్లోకి తేవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: